సెల్ టవర్ దిగిన సంజీవరావు
గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ... గుంటూరు జిల్లా పెదకాకానిలో సెల్ టవర్ ఎక్కిన ఎం. సంజీవరావు ఎట్టకేలకు మెత్తబడ్డారు. జిల్లా కలెక్టర్ హామీ ఇవ్వడంతో సంజీవరావు ఆదివారం రాత్రి సెల్ టవర్ దిగాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలనే డిమాండ్ చేస్తూ సంజీవరావు శనివారం పెదకాకానిలోని ఓ సెల్‌టవర్‌పైకి ఎక్కారు. గుంటూరు సీతానగరంకు చెందిన మామిళ్లపల్లి సంజీవరావు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని శనివారం ఉదయం పెదకాకాని పోలీసుస్టేషన్ పరిధిలోని ఆటోనగర్ సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న సెల్‌టవర్‌పైకి ఎక్కాడు. పోలీసులు అతడిని కిందకు దించేందుకు నిన్న రాత్రి నుంచి ప్రయత్నించినా అతడు కిందకి దిగలేదు.
నిన్న రాత్రి 9 గంటల సమయంలో మంచినీళ్లతో ఓ నలుగుర్ని పైకి పంపించారు. ఆ నలుగురు పది అడుగుల ఎత్తుకి ఎక్కగానే, అంతకంటే పైకి వస్తే తాను దూకేస్తానని సంజీవరావు బెదిరించాడు. దాంతో పోలీసుల సూచన మేరకు మంచినీళ్లను అతడికి సమీపంలో ఉంచి ఆ నలుగురు కిందకు దిగిపోయారు. ఆదివారం సాయంత్రం వరకు కూడా సంజీవరావు తన పట్టును వీడలేదు. సంజీవరావు ఓ వేళ కిందకు దూకితే అతడ్ని కాపాడేందుకు పోలీసులు వలలు ఏర్పాటు చేశారు. కానీ జిల్లా కలెక్టర్ ప్రత్యేక హోదా విషయంపై కేంద్రంతో మాట్లాడతానని హామీ ఇవ్వడంతో సంజీవరావు కిందకి దిగారు.