
అడ్డొచ్చాడని కొట్టి చంపాడు
కంకిపాడు : ఎదురెదురుగా వస్తున్న టీవీఎస్, సైకిల్ ఢీకొనడంతో.. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన సైకిలీస్ట్ టీవీఎస్ పై ఉన్న వ్యక్తిని తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆస్పత్రి పాలైన వాహనదారుడు చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి పునాదిపాడు సెంటర్‌లో టీవీఎస్పై వెళ్తున్న పొల్లూరు సాంబశివారావు (40) అనే వ్యక్తికి సైకిల్ పై వెళ్తున్న కిరణ్ ఎదురుగా వచ్చి ఢీకొట్టాడు.
దాంతో వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కోపోద్రిక్తుడైన కిరణ్.. సాంబశివరావుపై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలైన సాంబశివరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సెంటర్‌లో ఉన్న సీసీ టీవీ కెమరా ఫూటేజిల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.