సాక్షి, అనంతపురం : మండల స్థాయి స్టాక్ పాయింట్లు(ఎంఎల్‌ఎస్) అక్రమాలకు నిలయంగా మారాయి. ఇక్కడి నుంచి చౌక డిపోలకు సరఫరా చేస్తున్న నిత్యావసర సరుకుల తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఇది తెలిసినా డీలర్లు కిమ్మనడం లేదు. అధికారులను ప్రశ్నిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో సర్దుకుపోతున్నారు. ఆ మేరకు ‘లోటు’ను పూరించుకునేందుకు కార్డుదారులకు ‘కోత’ వేస్తున్నారు. దీనివల్ల అంతిమంగా పేదలు నష్టపోవాల్సి వస్తోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని 63 మండలాలకు గాను 24 మండలాల్లో ఎంఎల్‌ఎస్ పాయింట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి చౌక డిపోలకు ప్రతినెలా నిత్యావసర సరుకులు సరఫరా చేస్తుంటారు.
బియ్యం, చక్కెర వంటి వాటిని క్వింటాళ్ల కొద్దీ తూకం వేసి డీలర్లకు అందజేయాలి. అయితే... సరైన తూకాలు లేకుండానే అంటగడుతున్నారు. డీలర్లు కూడా కిమ్మనకుండా వాహనాల్లో ఎక్కిస్తున్నారు. ఇంటికెళ్లిన తరువాత తూకం తక్కువగా ఉండడం చూసి కంగుతింటున్నారు. ఆ లోటును పూడ్చుకునేందుకు కార్డుదారులకు తూకాల్లో మోసం చేస్తున్నారు. గోదాముల్లో సరుకులను తూకం వేసేందుకు సరైన పరికరాలు లేవు. దీంతో సలువుగా మోసాలకు పాల్పడుతున్నారు. తూకాల్లో మోసాలు ఉండకూడదన్న ఉద్దేశంతో ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలని 2008లో అప్పటి కలెక్టర్ జనార్దనరెడ్డి ప్రతిపాదన సిద్ధం చేశారు. అయితే... అది మరుగున పడిపోయింది.
ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు లేకపోవడంతో గోదాముల ఇన్‌చార్జ్‌లు (సీఎస్‌డీటీలు) యథేచ్ఛగా బియ్యాన్ని బొక్కేస్తున్నారు. అనంతపురం మార్కెట్ యార్డు ప్రాంగణంలోని పౌరసరఫరాల గోదామును ‘సాక్షి’ పరిశీలించగా.. అక్రమాలు వెలుగు చూశాయి. గోదాములోని బియ్యం బస్తాలలో 20 బస్తాలను సాధారణ వేయింగ్ మిషన్ ద్వారా తూకం వేయగా... ఒకటి మినహా 19 బస్తాలు 46-47 కిలోలు మాత్రమే ఉన్నాయి. ఈ విషయమై సిబ్బందిని ప్రశ్నించగా... ‘మాకేమీ తెలీదు సార్! సీఎస్‌డీటీకే తెలుసం’టూ తప్పుకున్నారు. సీఎస్‌డీటీ కోసం ఆరా తీయగా...ఆయన గోదాము పరిసరాల్లోనే కనిపించలేదు.
బస్తాకు 3-4 కిలోల లోటు
డీలరుకు సరఫరా చేసే బియ్యం బస్తా బరువు (గోనె సంచితో కలుపుకుని) కచ్చితంగా 50 కిలోల 660 గ్రాములు ఉండాలి. ఇందులో 50 కిలోల బియ్యం, 660 గ్రాములు సంచి బరువుగా లెక్కిస్తారు. జిల్లా కేంద్రంతో పాటు మిగిలిన 23 గోదాముల్లోనూ 46-47 కిలోల లోపే ఉంటోందని డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. బస్తాకు 3-4 కిలోలు తక్కువ ఇస్తుండడంతో తాము ఇబ్బంది పడాల్సి వస్తోందని వాపోతున్నారు.
ఈ లెక్కన ఒక డీలర్ వంద క్వింటాళ్ల బియ్యం (200 బస్తాలు) తీసుకెళ్తే... బస్తాకు 3-4 కిలోల చొప్పున మొత్తం 600 నుంచి 800 కిలోల బియ్యాన్ని కోల్పోవాల్సి వస్తోంది. జిల్లాలో ప్రతినెల 10.50 లక్షల తెల్లకార్డులకు 14,500 మెట్రిక్ టన్నుల (2.9 లక్షల బస్తాలు) బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. బస్తాకు 3-4 కిలోల చొప్పున మొత్తమ్మీద 8 లక్షల నుంచి 11.6 లక్షల కిలోల బియ్యం (8 వేల నుంచి 11,600 క్వింటాళ్లు) మండల స్థాయి స్టాక్ పాయింట్ల నుంచి పక్కదారి పడుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్న ఈ మోసం కారణంగా అంతిమంగా కార్డుదారులు నష్టపోతున్నారు. ప్రతి నెలా గోదాముల్లో బియ్యాన్ని బొక్కుతున్న అధికారులు... వారికి అనుకూలురైన దళారుల సాయంతో నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
విచారణ చేసి చర్యలు తీసుకుంటాం
చౌక బియ్యం బస్తాల తూకం తక్కువగా ఉంటున్న విషయం ఇంతవరకు నా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ చేయించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
- పౌరసరఫరాల జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్లు
అది మామూలే
బియ్యం బస్తాలు తక్కువగానే ఉంటాయి. మిల్లర్ల వద్ద నుంచి ప్రభుత్వం బియ్యం కొనుగోలు చేసేటప్పుడు అవి తడిగా ఉంటాయి. కాబట్టి బరువు ఎక్కువగా ఉంటుంది. గోదాముల్లోకి వచ్చిన తరువాత బియ్యంలో తేమ శాతం తగ్గిపోవడమే కాకుండా... ఎలుకలు రంధ్రాలు పెట్టి తినడం వల్ల తూకాలు తగ్గిపోతాయి.
- జిల్లా పౌరసరఫరాల అధికారి
(డీఎస్‌ఓ) శాంతకుమారి
గోదాముల్లో గూడు పుఠాణి
Published Sat, Nov 9 2013 3:20 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement