మంగళగిరి ఏరియల్ వ్యూ
సాక్షి, మంగళగిరి : పట్టణంలో అభివృద్ధి పట్టాలు ఎక్కనుంది. రూ.6 కోట్లతో మార్చి నెలకల్లా ఈ పనులను పూర్తిచేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా రూ.6 కోట్లు నిరుపయోగంగా ఉండిపోయాయి. ఈ నిధులు మురిగిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో, వాటిని ఖర్చు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 2014–15, 2015–16, 2016–17, 2017–18, 2018–19 సంవత్సరాల్లో మంగళగిరి మునిసిపాలిటీ అభివృద్ధి కోసం మంజూరయిన నిధులను సక్రమంగా వినియోగించడంలో టీడీపీ పాలకులు విఫలమవడంతో 2020 మార్చి చివర నాటికి ఖర్చు చేయకుంటే అవి మురిగిపోయే ప్రమాదం ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం అధికారులు, సిబ్బంది బదిలీలు జరిగిన నేపథ్యంలో నిధులను ఖర్చుచేయడంలో జాప్యం జరిగింది.
నిధులను ఖర్చు చేసేందుకు మరో ఆరు నెలల సమయం ఉన్న నేపథ్యంలో అభివృద్ధి పనులను అధికారులు యుద్ధప్రాతిపాదికన చేపడుతున్నారు. టీడీపీ హయాం మంజూరయ్యి 25 శాతం కంటే తక్కువ జరిగిన, అసలు ప్రారంభం కాని పనులను నిలిపివేయాలని ప్రభుత్వం జీఓ జారీ చేసింది. స్పందించిన అధికారులు ఆయా పనులను నిలిపివేశారు. అనంతరం పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న 14 రోడ్ల నిర్మాణానికి రూ.1.50 కోట్లతో టెండర్లు పిలిచారు. రత్నాల చెరువలో సిమెంట్ రోడ్డు, పాత మంగళగిరి, రాజీవ్‌గృహకల్ప ప్రాంతో పాటు పట్టణంలోని పలు వార్డుల్లో ఈ రోడ్లను నిర్మించనున్నారు. మిగిలిన నిధుల విషయంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పనులకు టెండర్లు పిలిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
మున్సిపల్ పాఠశాలలపై దృష్టి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన మౌలికసదుపాయాలు కల్పించడంతో పాటు అవసరమైన అదనపు గదుల నిర్మాణం, మరుగుదొడ్లు, సామగ్రి సమకూర్చి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మున్సిపాల్టిలో 18 పాఠశాలలకు అవసరమైన అవసరాలపై నివేదికలు సిద్ధం చేసిన అధికారులు, ఈ పనులకు రూ.4 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. మార్చి నెలాఖరు నాటికి రూ.3 కోట్లు వెచ్చింది పాఠశాలలు అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలోనే డిటైల్డ్ ప్రాజక్టు రిపోర్టు (డీపీఆర్)లు రూపొందించి ఉన్నతాధికారుల అనుమతులు పొంది టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి మార్చినాటికి పూర్తి చేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మార్చి నెలాఖరుకు పనులు పూర్తి చేస్తాం
మంగళగిరి పట్టణాభివృద్ధికి 2014–15 ఆర్థిక సంఘం మంజూరు చేసిన నిధులు పూర్తిగా ఖర్చుకాలేదు. ఇప్పటికే మంజూరైన రూ.6 కోట్లను మార్చిలోపు ఖర్చు చేయాలి. లేకుంటే ఆ నిధులు మురిగిపోతాయి. ఇప్పటికే రూ.1.50 కోట్లతో రోడ్ల నిర్మాణాలకు టెండర్లు పిలిచాం. మిగిలిన వాటికి త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. రూ.3 కోట్ల నిధులతో మున్సిపల్ పాఠశాలల అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. 2020 మార్చి నెలాఖరునాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
– హేమామాలిని, మంగళగిరి మున్సిపల్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment