సాక్షి, మంగళగిరి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పొత్తులు అవసరం లేదని, సింహం సింగిల్‌గానే వస్తుందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో వైఎస్ షర్మిల ప్రసగించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. రుణమాఫీ హామీతో రైతులు, డ్వాక్రా మహిళలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మోసం చేశారని, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగార్చి, ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు కుటుంబానికి జబ్బు చేస్తే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారా అని సూటిగా ప్రశ్నించారు. కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచారని, రాజధానిలో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కూడా చంద్రబాబు ప్రభుత్వం కట్టలేదని చెప్పారు. రైతుల ఉసురు చంద్రబాబుకు తప్పక తగులుతుందని శాపనార్ధాలు పెట్టారు. గత ఎన్నికల సమయంలో బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. కానీ లోకేష్‌కు మాత్రమే జాబు వచ్చిందని గుర్తు చేశారు.
లోకేష్‌కు వర్ధంతికి, జయంతికి తేడా తెలీదు
చంద్రబాబు తనయుడు లోకేష్‌కు వర్థంతికి, జయంతికీ కూడా తేడా తెలియదని షర్మిల ఎద్దేవా చేశారు. నారా లోకేష్ ఏం మేలు చేశారని అవార్డులు ఇచ్చారని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇప్పుడు కాంగ్రెస్‌తో చేతులు కలిపారని చెప్పారు. చంద్రబాబుది రోజుకో మాట, పూటకో వేషమని ఎద్దేవా చేశారు
బాబును చూసి ఊసరవెల్లి కూడా పారిపోతుంది
చంద్రబాబు నాయుడిని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుతో పారిపోతుందని షర్మిల వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారని, ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామా కూడా చేశారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ పోరాటాలతోనే ప్రత్యేక హోదా అంశం సజీవంగా ఉందన్నారు. ప్రత్యేక హోదాపై ఎన్నోసార్లు యూటర్న్ తీసుకున్నది చంద్రబాబు కాదా అని సూటిగా ప్రశ్నలేవనెత్తారు.
చంద్రబాబు నాయుడు ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. హైదరాబాద్‌లో ఉంటే కేసులు పెడతారనే భయంతో విజయవాడకు ఆఘమేఘాల మీద పారిపోయి వచ్చారని విమర్శించారు. హైదరాబాద్ నగరం పదేళ్ల వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్నా చంద్రబాబు తాను చేసిన పనికి పారిపోయి రావాల్సి వచ్చిందన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ ఛీ కొడుతూనే ఉన్నా ఆయనతోనే పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారని ఆరోపించారు. చివరకు హరికృష్ణ పార్ధీవ దేహం పక్కనుండగానే కేసీఆర్‌తో పొత్తు కోసం ప్రయత్నించిన విషయాన్ని మళ్లీ గుర్తు చేశారు. కమీషన్ల కోసం ప్రత్యేక హోదాను పక్కన పెట్టి ప్యాకేజీకి ఒప్పుకున్నారని దుయ్యబట్టారు.
చేనేత రుణాలు రూ. 3 లక్షల వరకు మాఫీ
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి అధికారంలోకి రాగానే చేనేతల రుణాలు రూ.3 లక్షల వరకు మాఫీ చేస్తామని ఈ సందర్భంగా షర్మిల హామీ ఇచ్చారు. మగ్గం ఉన్న ప్రతి ఇంటికి రూ.2 వేలు ఇస్తామని తెలిపారు. చేనేత కుటుంబంలో 45 ఏళ్లు ఉన్న ఇద్దరికి రూ.2 వేల పింఛన్ అందిస్తామని చెప్పారు. రాజన్య రాజ్యం రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలని అన్నారు. బైబై బాబు.. ఇదే ప్రజా తీర్పుకావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment