చంద్రబాబు ఇళ్లు ఖాళీ చేయాల్సిందే: ఆర్కే | Mangalagiri MLA Ramakrishna Reddy Visited Krishna River | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఇళ్లు ఖాళీ చేయాల్సిందే: ఆర్కే

Published Wed, Aug 14 2019 11:06 AM | Last Updated on Wed, Aug 14 2019 4:40 PM

Mangalagiri MLA Ramakrishna Reddy Visited Krishna River - Sakshi

సాక్షి, అమరావతి : ప్రకాశం బ్యారేజీలో వరద ఉధృతి భారీగా కొనసాగుతున్న నేపథ్యంలో మంగళగిరి ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణారెడ్డి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్‌ను పరిశీలించారు.  కృష్ణా నదీగర్భంలో అక్రమంగా నిర్మించిన నివాసాన్ని చూసి అక్కడి పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దానికి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎగువన గల పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీ వరద వస్తోందని, చంద్రబాబు నివాసంలోకి వరద నీరు వచ్చి చేరుతోందని తెలిపారు. 

అక్రమ నివాసాన్ని కాపాడుకునేందుకు లారీలతో ఇసుకను తరలిస్తున్నారని, ఇల్లు మునిగిపోతుందన్న భయంతోనే చంద్రబాబు ఇంటిని వదిలి హైదరాబాద్‌కు పారిపోయారని ఆర్కే ఎద్దేవా చేశారు. ​కాగా చంద్రబాబు అక్రమ నిర్మాణానికి వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. ఇంట్లోకి నీరు చేరకుండా సిబ్బంది ఇసుక బస్తాలు వేస్తున్న విషయం తెలిసిందే. కృష్ణా వరదను ముందే ఊహించిన చంద్రబాబు వారి కుటుంబ సభ్యులకు చెందిన వాహనాలను ముందే హ్యాపీ రిసార్ట్స్‌కు తరలించారని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో సరైన వర్షాలు పడక, వరదలు రాలేదు కనుకే ఆయనకు ఇక్కడి పరిస్థితి అర్థంకాలేదని ఆర్కే అన్నారు. ఇప్పుడు కాకపోయిన భవిష్యత్తులోనైనా చంద్రబాబు నాయుడు అక్రమ కట్టడాన్ని ఖాళీచేయక తప్పదని ఆయన హెచ్చరించారు.

(చదవండి: ముంపు ముప్పులో చంద్రబాబు కరకట్ట నివాసం..!)

పులిచింతల ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌లో నీటిమట్టం 12.3 అడుగులకు చేరుకుంది. 3.07 టీఎంసీల సామర్థ్యమున్న బ్యారేజీ పూర్తిగా నిండిపోయింది. ఇన్‌ఫ్లో 4.12 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 4.12 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరదలు ఇలాగే కొనసాగితే కరకట్ట పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెప్తున్నారు. దీంతో లోతట్టు ‍ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement