గ్రూప్‌-1పై సందేహాల ముసురు | Many Doubts on Group-1 | Sakshi
Sakshi News home page

గ్రూప్‌-1పై సందేహాల ముసురు

Published Sat, Mar 9 2019 4:36 AM | Last Updated on Thu, Mar 28 2019 5:23 PM

Many Doubts on Group-1 - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కీలకమైన గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ జారీచేసిన నోటిపికేషన్‌పై అనేక అనుమానాలు ముసురుకుంటున్నాయి. స్క్రీనింగ్‌ టెస్టు, మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక, మెయిన్స్‌లో రిజర్వేషన్లను అమలుచేసే విధానంపై అభ్యర్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. మరోపక్క.. గ్రూప్‌–1 పోస్టుల పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు తక్కువ సమయం ఉండడం, కొత్తగా ప్రకటించిన సిలబస్‌కు తగిన పుస్తకాలు అందుబాటులో లేకపోవడం కూడా అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది.

రేషియో తేల్చకుండా ఎంతమందిని తీస్తారు?
ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరులో జీఓ 153.. ఆ తరువాత డిసెంబరు చివర్లో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ముందు 182 పోస్టులు భర్తీచేయిస్తామని జీవో ఇచ్చిన సర్కార్‌.. ఆ తర్వాత 125 పోస్టులను మాత్రమే ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని ప్రకటన విడుదల చేసింది. వీటిలో కీలకమైన డిప్యుటీ కలెక్టర్‌ పోస్టులు 30 మాత్రమే ఉన్నాయి. వాస్తవానికి డిప్యుటీ కలెక్టర్‌ పోస్టులను ప్రభుత్వం తమకు నచ్చిన వారికి పదోన్నతుల ద్వారా నియమించుకుంటుండడంతో పలు సంఘాలు దీనిపై ఆందోళన చేశాయి. దీనిపై ప్రభుత్వం నియమించిన కమిటీ.. డైరెక్టు రిక్రూట్‌మెంటులో 80 పోస్టులను భర్తీచేయాలని సూచించింది. కానీ, ప్రభుత్వం కేవలం 30 మాత్రమే ప్రకటించింది. వీటితోపాటు మరికొన్ని విభాగాల గ్రూప్‌–1 పోస్టులను కలిపింది. కాగా, గతంలో ప్రిలిమ్స్‌ ద్వారా మెయిన్స్‌కు 1 : 50 చొప్పున నిష్పత్తిలో కటాఫ్‌ మార్కులు నిర్ణయించి ప్రభుత్వం అభ్యర్థులను ఎంపిక చేసేది. కానీ, ఈసారి యూపీఎస్సీ విధానం అంటూ ఓసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీల వారీగా కొత్త విధానాన్ని ప్రకటించింది. నోటిఫికేషన్లోనే ఏ నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉండాలో ప్రకటించాల్సి ఉన్నా ఇప్పటివరకు దాన్ని తేల్చలేదు. ఇది తేలిస్తే దాని ప్రకారం కటాఫ్‌పై కూడా స్పష్టత వస్తుంది. ఇప్పటివరకు నిష్పత్తి సంఖ్యను ప్రకటించకపోవడం వెనుక మర్మమేమిటన్న అనుమానాలు అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్నాయి. తమకు కావలసిన వారిని మెయిన్స్‌కు ఎంపికయ్యేలా చేయడానికే నిష్పతి సంఖ్యను ప్రభుత్వం ముందుగా ప్రకటించడంలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. 

ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలి
కాగా, డిసెంబరులో నోటిఫికేషన్‌ ఇచ్చి చదువుకునేందుకు తగినంత సమయం ఇవ్వకుండా ప్రిలిమ్స్‌ నిర్వహించడం సరికాదని, తమకు కొంత వ్యవధి ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. కొత్తగా సిలబస్‌ మార్చారని, ప్రామాణిక పుస్తకాలూ పేర్కొనలేదని, సరైన పుస్తకాలు లేక తక్కువ సమయంలో ప్రిపేర్‌ కాలేకపోతున్నందున ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని వారు అభ్యర్థిస్తున్నారు. కానీ, ఇప్పటికే అభ్యర్థుల కోరిక మేరకు పరీక్ష తేదీని మార్చి 10 నుంచి మార్చి 31కి మార్చామని.. ఇక రెండోసారి పొడిగించలేమని ఏపీపీఎస్సీ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు.. రిజర్వేషన్ల విషయంలోనూ అన్యాయం జరుగుతోందని అభ్యర్థులు అంటున్నారు. ప్రిలిమ్స్‌లో రిజర్వేషన్‌ను వినియోగించుకుని మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థి అదే కేటగిరీ పోస్టుకు పరిమితం కావలసి ఉంటుందని, ఓపెన్‌ కేటగిరీ పోస్టుకు అర్హతలేదని ఏపీపీఎస్సీ నిబంధన విధించింది. దీనిని హైకోర్టు తప్పుబడుతూ మెయిన్స్‌లో వారిని ఓపెన్‌ కేటగిరీలోనూ అనుమతించేలా నోటిఫికేషన్‌లో మార్పులు చేయాలని ఆదేశించింది. కానీ, కమిషన్‌ పట్టించుకోవడంలేదని అభ్యర్థులు వాపోతున్నారు.  

మెరిట్‌ అభ్యర్థులకు అన్యాయం
ఇదిలా ఉంటే.. ఇంటర్వ్యూ మార్కుల కేటాయింపుల్లో అనేక మతలబులు  జరుగుతున్నాయని అభ్యర్థులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు అభ్యర్థుల నిష్పత్తి సంఖ్యను నిర్ణయించకపోవడం వెనక కూడా ఇదే కారణమై ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. తమకు కావలసిన వారిని ప్రభుత్వం మెయిన్స్‌కు ఎంపిక చేయించి ఇంటర్వ్యూల్లో ఎక్కువ మార్కులు వేయించడం ద్వారా వారికి గ్రూప్‌–1 పోస్టులు కట్టబెట్టాలన్న ప్రణాళిక దాగి ఉందేమోనని సందేహిస్తున్నారు. ఎందుకంటే గతంలోనూ ఇంటర్వ్యూ మార్కుల కేటాయింపుల్లో అభ్యర్థుల మధ్య చాలా వ్యత్యాసం ఉందంటున్నారు. గ్రూప్‌–1 మెయిన్స్‌లో 750 మార్కులకు ప్రధాన పరీక్ష, 75 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. గతంలో ఇంటర్వ్యూల్లో కనిష్ట మార్కులు 20కి లోపే ఉండగా గరిష్ఠ మార్కులు 70 వరకు వేశారని గుర్తుచేస్తున్నారు. ఈ మార్కుల మధ్య వ్యత్యాసం 50 వరకు ఉంటోంది. రాతపరీక్షలో అత్యధిక మార్కులు సంపాదించిన వ్యక్తికి ఇంటర్వ్యూల్లో మార్కులు రాకపోతే తీవ్రంగా నష్టపోతున్నాడు. ప్రభుత్వంలోని పెద్దలు కమిషన్‌పై ఒత్తిడిచేసి ప్రిలిమ్స్‌ నుంచి తమ వారిని మెయిన్స్‌కు ఎంపిక చేయించుకుని ఇంటర్వ్యూలపైనా ప్రభావం చూపిస్తే రాత పరీక్షల్లో మెరిట్‌ సాధించిన వారికి తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అలా కాకుండా ముందుగానే నిష్పత్తి సంఖ్యను ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement