సమైక్య రాష్ట్ర సాధనే లక్ష్యమని పలువురు ముక్తకంఠంతో నినదించారు. రాష్ట్ర విభజనకు నిరసనగా ఆందోళనలు, ఉద్యమాలు, రిలే దీక్షలు తీవ్రమయ్యాయి. పశుసంవర్థకశాఖ ఉద్యోగులు మరో అడుగు ముందుకేసి ఆమరణ దీక్షకు దిగారు.
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: సమైక్య రాష్ట్ర సాధనే లక్ష్యమని పలువురు ముక్తకంఠంతో నినదించారు. రాష్ట్ర విభజనకు నిరసనగా ఆందోళనలు, ఉద్యమాలు, రిలే దీక్షలు తీవ్రమయ్యాయి. పశుసంవర్థకశాఖ ఉద్యోగులు మరో అడుగు ముందుకేసి ఆమరణ దీక్షకు దిగారు.
సీమాంధ్రులు సిద్ధంగా లేరు
విభజనను అంగీకరించి హైదరాబాద్‌ను తెలంగాణకు అప్పగించేందుకు సీమాంధ్రులు సిద్ధంగా లేరని ఇంటర్ బోర్డ్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి వై పరంధామయ్య పేర్కొన్నారు. దర్గామిట్టలోని డీకే ప్రభుత్వ కళాశాల ఎదుట ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్, లెక్చరర్లు చేపట్టిన రిలే దీక్ష శిబిరాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా అభివృద్ధి చేసుకున్న ప్రాంతాన్ని ఒక్కసారిగా వదులుకోవాల్సి వస్తుండటంతో ప్రజలు మనోవేదనకు గురవుతున్నారన్నారు. వెంకయ్య, శ్రీనివాసులు, కృష్ణమూర్తి, సురేష్, రమణారెడ్డి, సర్దార్, గౌస్‌బాషా, కృష్ణప్రసాద్, చంటిరాజు, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల భవిత ప్రశ్నార్థకం
రాష్ట్ర విభజనతో విద్యార్థుల భవిత ప్రశ్నార్థకమవుతుందని వీఎస్‌యూ అధ్యాపక జేఏసీ ప్రధాన కార్యదర్శి సుజయ్‌కుమార్ పేర్కొన్నారు. విభజనకు నిరసనగా నగరంలోని వీఆర్సీ కూడలిలో రోడ్డుపైనే తరగతులు నిర్వహించారు. అధ్యాపకులు బోర్డు ఏర్పాటు చేసి పాఠాలు చెప్పారు. శ్రీనివాసులురెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, శ్రీలత, దీప్తి, విజయ, వీరారెడ్డి, రమేష్‌రెడ్డి, పీసీరెడ్డి, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
నాయకులు రాజీనామాలు సమర్పించాలి
సీమాంధ్రలోని అన్ని పార్టీల నాయకులు తమ పదవులు, పార్టీ సభ్యత్వాలకు రాజీనామా సమర్పించి ఉద్యమించాలని యూటీఎఫ్ నాయకుడు గోపాల్ పేర్కొన్నారు. విభజనకు నిరసనగా నగరంలోని వీఆర్సీ కూడలిలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు బుధవారంతో 24వ రోజుకు చేరుకున్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఉపాధ్యాయులు వీఆర్సీ కూడలిలో మానవహారం చేపట్టారు. రోడ్డుపైనే కబడ్డీ ఆడి నిరసన వ్యక్తం చేశారు.
సమైక్యాంధ్ర సాధించే వరకూ దీక్ష ఆగదు
సమైక్యాంధ్ర సాధించే వరకూ దీక్ష ఆగదని నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న పశుసంవర్థకశాఖ ఉద్యోగులు విక్రమ్‌సాగర్, వెంకటరమణయ్య, నవాజ్, పొదిలి శ్రీనివాసులు పేర్కొన్నారు. దర్గామిట్టలోని ఎన్జీఓ హోమ్‌లో చేపట్టిన ఆమరణ నిరశన దీక్ష బుధవారంతో రెండో రోజుకు చేరుకుంది. ఎన్జీఓ సంఘ నాయకులు రవీంద్రబాబు, అంకమరాజు, రమణారెడ్డి, ఆంజనేయవర్మ, సుధాకర్‌రావు, శేఖర్‌రావు, సతీష్‌బాబు, వివిధ శాఖలకు చెందిన అధికారులు దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.
అవిశ్రాంత పోరాటం
సమైక్య రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంత పోరాటం చేస్తామని టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమలనాయుడు పేర్కొన్నారు. విభజనకు నిరసనగా జిల్లాలో చేపట్టిన ఉద్యమాలు 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం రాత్రి స్థానిక వీఆర్ హైస్కూల్ క్రీడా మైదానంలో 50 అంకెను నిప్పుతో రగిల్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమైక్య రాష్ట్ర సాధన కోసం ఎన్ని రోజులు, నెలలు, సంవత్సరాలైనా ఉద్యమించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
ఆటాపాటలతో పీఆర్ ఉద్యోగుల నిరసన
నెల్లూరు(టౌన్): రాష్ట్ర విభజన ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ పీఆర్ శాఖకు చెందిన పలువురు ఉద్యోగులు బుధవారం నెల్లూరు జెడ్పీ కార్యాలయం ఎదుట రోడ్డుపై ఆటాపాటలతో నిరసన తెలిపారు. బారకాస్ రోడ్డుకు అడ్డంగా తాళ్లు కట్టి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. కబడ్డీ, వాలీబాల్, క్యారమ్స్, షటిల్, తదితర ఆటలు ఆడుతూ సమైక్యాంధ్ర నినాదాలు చేశారు.
సమైక్య రాష్ట్ర ఆవశ్యకతను వివరిస్తూ పాటలు పాడారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్ శాఖ జేఏసీ కన్వీనర్ మున్వర్ మాట్లాడారు. కేంద్రం సమైక్య ప్రకటన చేసేంతవరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు నెల్లూరు విజయకుమార్, ఇంజినీరింగ్ అసోసియేషన్ నాయకులు, పీఆర్‌ఐ గూడూరు ఈఈ చంద్రశేఖరయ్య, ఏఈ వెంకయ్య, ఏఈఈలు గిరినాథ్, శ్రీధర్, నాలుగో తరగతి ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు భీమిరెడ్డి, మధు పాల్గొన్నారు.
ర్యాలీ..
నెల్లూరు (బృందావనం): నగరంలోని స్టోన్‌హౌస్‌పేటలో బుధవారం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ జిల్లా శాఖ గౌరవాధ్యక్షుడు ముదిగొండ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ఉద్యమ ప్రదర్శన చేపట్టారు. మేళతాళాలు, డప్పుల నడుమ ప్రదర్శన సాగింది. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు, అడిషనల్ జాయింట్ కలెక్టర్ పెంచలరెడ్డి, జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి బాలకృష్ణమూర్తి, తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. స్థానిక కేఏసీ జూనియర్ కళాశాల నుంచి కూరగాయల మార్కెట్, కన్యకాపరమేశ్వరి దేవస్థానం, పాండురంగ అన్నదాన సమాజం మీదుగా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ర్యాలీ సాగింది. ప్రదర్శనలో వివిధ సంఘాలకు చెందిన నాయకులు, ముఠావర్కర్లు, ఆర్టీటీ సలహాదారు సురేష్, తదితరులు పాల్గొన్నారు.
వంటావార్పు
నెల్లూరు(హరనాథపురం): సమైక్యాంధ్ర ఉద్యమం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రంగనాయకులపేట యాదవవీధి సెం టర్‌లో మాజీ కార్పొరేటర్ మునాఫ్ ఆధ్వర్యం లో బుధవారం వంటావార్పు నిర్వహించారు. తొలుత ఉప్పుతో ఆంధ్రప్రదేశ్ చిత్రపటాన్ని రోడ్డుపై తీర్చిదిద్దారు. అనంతరం ఉపాధ్యాయుడు శంకర్‌యాదవ్‌కు నివాళులర్పించారు. స్థానిక నేత రవికుమార్, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.
పోస్టాఫీస్ ఎదుట ధర్నా
సమైక్యాంధ్రకు మద్దతుగా పొట్టి శ్రీరాములు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరులోని ప్రధాన పోస్టాఫీస్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. తొలుత సమైక్యవాదులు సమైక్యాంధ్ర జెండాలను చేతబట్టి పోస్టాఫీస్ లోపలికి వెళ్లి సిబ్బందిని బయటకు పంపించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి మాట్లాడారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే ప్రజల కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమానికి సహకరించాలని కోరారు. ఏపీ ఎన్జీఓల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు గురు, శుక్రవారాల్లో కేంద్ర ప్రభుత్వ సిబ్బంది సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, డీసీసీ ఇన్‌చార్జి అధ్యక్షుడు చాట్ల నరసింహరావు, ఆనం విజయకుమార్‌రెడ్డి, వృత్తి కళాశాలల జేఏసీ కన్వీనర్ విజయభాస్కర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బీసీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా
నెల్లూరు(నరసింహకొండ): సీమాంధ్రలో ప్రజలు రోడ్లపైకి వచ్చి సమైక్యవాదం వినిపిస్తున్నా, కేంద్రానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం దారుణమని బీసీఎస్‌ఎఫ్ సంస్థ నెల్లూరు రూరల్ అధ్యక్షుడు కేశవనారాయణ పేర్కొన్నారు. వేదాయపాళెం సెంటర్‌లో సంస్థ సారథ్యంలో శ్రీపతి ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్యార్థులతో బుధవారం మానవహారం, రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థులు తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు, శివాజీ, అల్లూరి సీతారామరాజు, వివేకానంద, శ్రీకృష్ణదేవరాయులు, తదితరుల వేషధారణలతో అలరించారు. పాఠశాల ఉపాధ్యాయులు వినోద్, హలీమ్, మురళి, అబ్దుల్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.