దేశవ్యాప్తంగా పేట్రేగిపోతున్న మావోయిస్టు కార్యక్రమాలను అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది.
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పేట్రేగిపోతున్న మావోయిస్టు కార్యక్రమాలను అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల యాంటీ నక్సల్ విభాగాలతో కలిసి సంయుక్త కార్యాచరణకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ విభాగాల సమన్వయ బాధ్యతను ఆంధ్ర-చత్తీస్‌గఢ్‌కు చెందింన ఇంటెలిజెన్స్ అధికారులకు అప్పగించాలని భావిస్తోంది. చత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో రెండు రోజుల కిందట మావోయిస్టులు విరుచుకుపడి సీఆర్‌పీఎప్ జవాన్లతో సహా మొత్తం 16 మందిని హతమార్చిన విషయం తెలిసిందే. అంతకుముందు అదే ప్రాంతంలో కాంగ్రెస్ నేత మహేంద్రకర్మతో సహా 36 మందిని మట్టుపెట్టారు. మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకుంటామని ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించారు.
ఈ మేరకు ఒకవైపు సీఆర్‌పీఎఫ్‌లోని యాంటీ నక్సల్స్ విభాగం కోబ్రా దళాలతో కూంబింగ్ ఆపరేషన్‌లను కొనసాగిస్తూనే, మరోవైపు తొమ్మిది నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలమధ్య మరింత సమన్వయాన్ని సాధించి మావోయిస్టులను అణిచివేసే ఆపరేషన్‌లను నిరంతరం కొనసాగించేందుకు హోం శాఖ సంసిద్ధమైంది. ఇందులో భాగంగానే చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ర్ట, బీహార్, జార్ఖండ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలన్నీ ఒకే తాటిపైకి వచ్చి, సమాచారాన్ని పరస్పరం పంచుకుంటూ మావోయిస్టులను నిరోధించేలా వ్యూహరచన చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభావిత రాష్ట్రాల నిఘా అధికారులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి చర్చించారని తెలిసింది. ముఖ్యంగా యాంటీ నక్సలైట్ ఇంటెలిజెన్స్‌విభాగాలకు అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలను సమకూర్చేందుకు హోంశాఖ సిద్ధమవుతోంది. ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి ఇజ్రాయిల్ అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం జరపడానికి త్వరలోనే నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల నిఘా అధికారులను అక్కడకు పంపించే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.