ఏపీ గ్రూప్–2 మెయిన్స్‌లో కాపీ కొట్టేశారు..
♦ నిబంధనలకు విరుద్ధంగా సెల్‌ఫోన్లు, పెన్ కెమెరాల అనుమతి
♦ ఆన్సర్లు తెప్పించుకొని దర్జాగా రాసుకున్న అభ్యర్థులు
♦ చీరాల, ఒంగోలు ప్రాంతాల్లో జోరుగా మాస్ కాపీయింగ్
♦ ఏపీపీఎస్సీ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదుల వెల్లువ
♦ సీసీ ఫుటేజ్‌లు పరిశీలించాలని వినతి
ఏపీపీఎస్సీ గ్రూప్–2 పరీక్షలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈనెల 15, 16 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించిన మెయిన్స్‌లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్లు కాదు కదా కనీసం పెన్ను కూడా అనుమతించలేదని నిర్వాహకులు చెప్పినప్పటికీ కొన్ని సెంటర్లలో మాస్ కాపీయింగ్ జరిగినట్టు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఒంగోలు: పది రోజుల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్–2 మెయిన్స్ ఆన్‌లైన్ పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సెంటర్లలో అభ్యర్థులు జోరుగా కాపీయింగ్‌కు పాల్పడ్డారని ఏపీపీఎస్సీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలోని పలు సెంటర్లలో ఈ కాపీయింగ్ యథేచ్ఛగా సాగిందని, ముఖ్యంగా జిల్లాలోని చీరాల, ఒంగోలు ప్రాంతాల్లోని సెంటర్లలో కాపీయింగ్ జరిగిందని పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు. కొన్ని కాలేజీల్లో నిబంధనలకు విరుద్ధంగా పెన్ కెమెరాలు, సెల్‌ఫోన్లు అనుమతిచ్చారని, తద్వారా ప్రశ్న పత్రాలు బయటకు పంపి కొందరు అభ్యర్థులు అన్సర్లు తెప్పించుకొని అక్రమాలకు పాల్పడ్డారని ఆ ఫిర్యాదుల్లో వివరించారు.
కాపీయింగ్ వల్లే అధిక మార్కులు..
ప్రకాశం జిల్లాలో చీరాల, ఒంగోలుతో పాటు పలు సెంటర్లలో ఈ అక్రమాలు పెద్ద ఎత్తున సాగినట్లు కొందరు అభ్యర్థులు ‘సాక్షి’కి వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని కాలేజీల్లో పెన్ కెమెరాలు, మరికొన్ని కాలేజీల్లో సెల్‌ఫోన్లు అనుమతించినట్లు వారు పేర్కొన్నారు. పరీక్ష అయిన మరుసటి రోజు ఏపీపీఎస్సీ ‘కీ’ విడుదల చేయగా జిల్లావ్యాప్తంగా అన్ని సెంటర్లలోనూ 230 నుంచి 260 మార్కులు రాగా.. చీరాలకు చెందిన సెంటర్‌లో మాత్రం 320 నుంచి 336 వరకు మార్కులొచ్చాయన్నారు. ఇది కాపీయింగ్ వల్లే సాధ్యమైనదనేది ఫిర్యాదు చేసిన అభ్యర్థుల వాదన.
సీసీ ఫుటేజిలు అభ్యర్థులే తెచ్చివ్వాలట..
తమ ఫిర్యాదులకు ఏపీపీఎస్సీ స్పందించటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఎగ్జామ్ సెంటర్లలోని సీసీ ఫుటేజ్‌లను పరిశీలించాలని కొందరు అభ్యర్థులు ఏపీపీఎస్సీ హెల్ప్‌లైన్‌కు పాటు రాతపూర్వకంగా ఫిర్యాదులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సమాధానంగా ఏపీపీఎస్సీ అధికారులు ఫిర్యాదుతో పాటు సదరు సెంటర్లకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌లు మీరే తెచ్చి ఇవ్వాలంటూ అభ్యర్థులకు చెప్పినట్లు కొందరు అభ్యర్థులు పేర్కొంటున్నారు. అభ్యర్థులకు ఎగ్జామ్ సెంటర్లు నిర్వహించిన కళాశాలలు సీసీ ఫుటేజ్‌లు ఎలా ఇస్తాయని వారు ప్రశ్నిస్తున్నారు. అక్రమాలు జరిగాయని ఏపీపీఎస్సీకి వివరాలు అందించినా.. స్పందించటం లేదని వారు వాపోతున్నారు.
సెంటర్లలోని సీసీ ఫుటేజ్‌లు ఇప్పటికే ఏపీపీఎస్సీ వద్ద ఉన్నాయని వాటిని పరిశీలిస్తే అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. కొన్ని కళాశాలలు, రాష్ట్రస్థాయిలో పెద్దలు ఒత్తిడి వల్లే ఏపీపీఎస్సీ అక్రమాలను పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత స్థాయి ఉద్యోగాలకు పకడ్బందీగా పరీక్ష నిర్వహించాల్సి ఉన్నా ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదని, కనీసం ఆరోపణలు వచ్చినప్పుడైనా విచారణ జరపాల్సిన ఏపీపీఎస్సీ ఏ మాత్రం పట్టించుకోకపోవడంపై అభ్యర్థుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.