![Massive debt with municipal property mortgages - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/24/LAND-BANK-.jpg.webp?itok=ASqAZ1pW)
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో రైతుల నుంచి తీసుకున్న భూములను తాకట్టు పెట్టి వాణిజ్య బ్యాంకుల నుంచి రూ.10 వేల కోట్లు అప్పు చేసేందుకు ఇప్పటికే అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మునిసిపల్ ఆస్తులను కూడా తాకట్టు పెట్టి భారీగా అప్పు తీసుకోవాలని నిర్ణయించింది. బడ్జెట్‌లో అప్పులు చేసేందుకు ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం) నిబంధనలు అంగీకరించకపోవడంతో బడ్జెట్ బయట వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సర్కారే గ్యారెంటీ ఇస్తూ భారీ అప్పులకు అనుమతిస్తున్న విషయం తెలిసిందే.
బడ్జెట్ బయట అప్పులకు ముగిసిన గ్యారెంటీ పరిమితి
మున్సిపాలిటీల్లో నీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ, అంతర్గత రహదారులు, పార్కులు, శ్మశానవాటికలు తదితర మౌలిక సదుపాయాల కోసం వాణిజ్య బ్యాంకుల నుంచి రూ.11,340 కోట్లు అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే బడ్జెట్ బయట అప్పులకు సర్కారు గ్యారెంటీ పరిమితి ఇప్పటికే పూర్తి కావటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య బ్యాంకుల నుంచి రూ.3.000 కోట్ల అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. మిగతా మొత్తం అప్పులకు తదుపరి ఆర్థిక సంవత్సరాల్లో గ్యారెంటీ ఇవ్వనున్నట్లు మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి కరికాలవలవన్ సోమవారం జీవో జారీ చేశారు.
మునిసిపాలిటీల ఆస్తులు తాకట్టు..
రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తున్నప్పటికీ మున్సిపాలిటీలే అసలు, వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని జీవోలో స్పష్టం చేశారు. మున్సిపాల్టీల ఆస్తులను తాకట్టు పెట్టుకుని వాణిజ్య బ్యాంకులు అప్పు ఇవ్వనున్నాయి. ఫలితంగా భవిష్యత్‌లో మున్సిపాల్టీలు భారీ అప్పుల పాలు కానున్నాయి. దీంతో ఈ అప్పులు తీర్చడానికి పౌర సేవలపై భారీగా చార్జీలను వసూలు చేయనున్నాయి. దీనివల్ల మున్సిపాలిటీల్లో అన్నిరకాల చార్జీలు పెరగనున్నాయి. ఇప్పటికే గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారానే లక్షన్నర కోట్ల రూపాయల మేర అప్పులు చేసింది. ఇప్పుడు బడ్జెట్ బయట వివిధ సంస్థల పేరుతో సర్కారు గ్యారెంటీ ఇస్తూ భారీగా అప్పులు చేయడాన్ని అధికార వర్గాలు తప్పుబడుతున్నాయి. ఈ గ్యారెంటీలు కూడా ప్రభుత్వ అప్పు కిందకే వస్తాయని, ఆ సంస్థలు తీర్చకపోతే రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.
అసలు కంటే వడ్డీ భారమే అధికం..
మునిసిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టు వ్యయం రూ.12,600 కోట్లు కాగా ఇందులో 90 శాతం అంటే రూ.11,340 కోట్లను వాణిజ్య బ్యాంకుల నుంచి 8.23 శాతం వడ్డీపై అప్పు చేయనున్నారు. మిగతా పది శాతం అంటే రూ.1,260 కోట్లను ఈక్విటీ కింద ప్రభుత్వం సమకూర్చుతుంది. జీవోలో పేర్కొన్న మేరకు తీసుకునే రూ.11,340 కోట్ల అప్పును తొలి రెండు సంవత్సరాల్లో చెల్లించనవసరం లేదు. ఆ తరువాత నుంచి 13 ఏళ్లలో అసలు, వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 8.23 శాతం వడ్డీ అంటే 13 ఏళ్లలో వడ్డీ కిందే రూ.12,265 కోట్లు కట్టాల్సి ఉంటుంది. అంటే అప్పు కన్నా వడ్డీ భారం ఎక్కువగా అవుతుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment