ఖమ్మం జిల్లా కొత్తగూడెం సమీపంలోని సర్వారం మా సొంతూరు. నాన్న బద్రు, అమ్మ మంగమ్మ. ఎనిమిది సంతానంలో నేనే పెద్ద. మాది పేద కుటుంబం. వ్యవసాయమే ప్రధాన వృత్తి కావడంతో అమ్మనాన్నలకు చేదోడువాదోడుగా పొలం పనులు చేసే వాడిని. అరక దున్నడం, మోట కొట్టడం, చేనుకు నీళ్లు పెట్టడం చేసేవాణ్ని.
పస్తులైనా ఉంటాం కానీ చదువు మానొద్దన్నారు..
సర్వారంలోనే 3వ తరగతి వరకు చదివా. ఆ తర్వాత కొత్తగూడెంలోని సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్‌లో చేరా. రోజు 4కి.మీ. నడిచి బడికి వెళ్లేవాడిని. ఏడో తరగతి వరకు అక్కడే చదివా. ఆ తర్వాత... చదువు మానేద్దామనే ఆలోచన వచ్చింది. తల్లిదండ్రులు క ష్టపడుతున్న తీరు నన్ను కలచివేసింది. చదువు ఆపేసి వారికి ఆసరాగా నిలుద్దామని నిర్ణయించుకున్నా. ఈ విషయాన్ని అమ్మనాన్నకు చెప్పాను. ‘మేం మూడు పూటలు పస్తులుండైనా నిన్ను చదివిస్తాం. కానీ నీవు మాత్రం చదువు ఆపకూడద’ని తేల్చి చెప్పారు. ప్రాథమిక విద్యనభ్యసించినవారికీ చదువు విలువ తెలుసు. తమలా నీవు కష్టపడకూడదని... చదువుతోనే సమాజంలో గుర్తింపు ఉంటుందని విడమరిచి చెప్పడంతో వారి మాటను కాదనలేకపోయా.
హాస్టల్ బాట పట్టా..
రామవరం ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో పదో తరగతిలో చేరా. అక్కడే హాస్టల్‌లో ఉంటూ టెన్త్ పూర్తి చేశా. అప్పటివరకు నేను యావరేజి స్టూడెంట్‌నే. పది పూర్తయిందో లేదో మరోసారి చ దువు మానేయ్యాలనే ఆలోచన మదిని తొలిచింది. ఇరుగు పొరుగువారు వారించడంతో పాల్వంచలోని జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్(బైపీసీ)లో చేరా. అప్పటివరకు తెలుగు మాధ్యమంలో చదివిన నేను ఇంటర్‌లో ఇంగ్లిష్ మీడియం ఎంచుకున్నా. కాలేజీ ప్రిన్సిపాల్ ప్రభావతి మాత్రం ఇంగ్లిష్ మీడియంలో చేర్చుకునేందుకు తొలుత అభ్యంతరం వ్యక్తంచేశారు. బాగా చదువుతానని అంగీకారపత్రాన్ని నాతో రాయించుకొని ఇంగ్లిష్ మీడియంలో చేర్చుకున్నారు. ప్రిన్సిపాల్ ప్రభావతి మేడమ్‌కు ఇచ్చిన మాట ప్రకారం ఇంటర్‌లో ప్రతిభ చాటా.
ప్రభాకర్‌రావు మాస్టారు క్లాస్‌తోనే..
ఇంటర్‌లో ఉన్నప్పుడు ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. టెన్త్ ఉత్తీర్ణుడిని కాగానే ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో నిరుద్యోగిగా పేరు నమోదు చేయించుకున్నా. సింగరేణికాలరీస్‌లో మజ్దూర్ కొలువు కోసం కాల్ లెటర్ వచ్చింది. ఇంకేం ఇంటర్వ్యూకు బయలుదేరా. నా అదృష్టం బాగుండి ఆ ఇంటర్వ్యూ వాయిదా పడింది. ఈ విషయం మా బాటనీ లెక్చరర్ ప్రభాకర్‌రావుకు తెలిసింది. ఆయన నాకు తీసుకున్న క్లాస్ నా జీవితాన్నే మలుపు తిప్పింది. ‘అక్షరజ్ఞానం లేని వారు కూడా కూలీ ఉద్యోగానికి వెళ్లొచ్చు. చదువుకునేవారే వెళ్లక్కర్లలేదు. హాయిగా చదువుకొని డాక్టరయ్యేందుకు ప్రయత్నించు’ అని ఆయన చెప్పిన మాటలు నాలో కసిని పెంచాయి.
అమ్మకిచ్చిన మాట కోసం..
అధ్యాపకుడి ప్రేరణతో అప్పటివరకు యావరేజి స్టూడెంట్‌గా ఉన్న నేను కాలేజీలో టాపర్‌గా మారాను. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఐఏఆర్‌ఐలో ఎమ్మెస్సీ చేశా. కస్టమ్స్ ఆఫీసర్, డీఎస్పీగా ఉద్యోగాలు వచ్చినా... నా చూపంతా కలెక్టర్ పోస్టుపైనే ఉండేది. అమ్మానాన్నల కోరిక కూడా అదే. అమ్మకిచ్చిన మాట ప్రకారం సివిల్స్‌కు ప్రిపేరయ్యా. మొదటిసారే ఐఆర్‌టీఎస్‌కు సెలెక్టయ్యా. ఈ పోస్టుతో ప్రజలకు సేవ చేసే వీలుండదని భావించి గ్రూప్-1 రాశా. డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యా.
పొదుపు విప్లవం సృష్టించాం..
క ర్నూలు జిల్లా ఆదోనిలో ఆర్డీవోగా తొలి పోస్టింగ్. ఆ తర్వాత పశ్చిమగోదావరిలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా... నల్గొండ జిల్లాలో డీఆర్‌వో, డ్వామా పీడీ, డీఆర్‌డీఏ పీడీ, సహాయ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ, నా సర్వీసులో తృప్తినిచ్చింది మాత్రం పశ్చిమగోదావరి, నల్గొండ జిల్లాల్లో పనిచేస్తున్నప్పుడే. పొదుపు సంఘాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. పావలా వడ్డీ పథకంపై మహిళలను సంఘటితం చేశాం. ఇది జాతీయ స్థాయిలో నాకు పేరు తెచ్చిపెట్టింది. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా పురస్కారం లభించింది. ఇది మరిచిపోలేని అనుభవం.
ఇష్టమైన ప్రదేశం..
నాకు నచ్చిన హాలీడే స్పాట్ కులు మనాలీ, కాశ్మీర్. సెలవులొస్తే శీతల ప్రాంతాల్లో సేద తీరేందుకు ఇష్టపడతా. వీలున్నప్పుడల్లా సొంతూరు సర్వారం వెళ్లి వస్తా. ఆదివారాల్లో కొద్ది సమయం చిత్ర లేఖనానికి కేటాయిస్తా.
యువతకిదే నా సందేశం..
మా రోజులు సౌకర్యాల్లేవు. అవకాశాల గురించి చెప్పే నాథుడేలేరు. ఇప్పుడు అన్నీ మన ముంగిట్లోకి వచ్చాయి. యువతలో పోటీతత్వం కూడా పెరిగింది. అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగితే విజయాలు మన సొంతమవుతాయి. టెన్షన్‌కు గురికాకుండా లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయండి. గమ్యాన్ని సులువుగా చేరుకోవచ్చు.
కళలంటే ప్రాణం..
నటన అంటే ఇష్టం. స్కూల్‌డేస్ నుంచే స్టేజిపై నాటకాలు ప్రదర్శించా. ఢిల్లీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో పలు ప్రదర్శనలిచ్చా. కేవలం నాటకాలే కాదు సినిమా రంగంలోనే ప్రవేశం ఉంది. స్నేహితుడా, శౌర్యం తదితర సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేశా. ప్రభుత్వ అధికారిని కావడంతో పరిమితులు దాటకుండా వెండితెరపై నటించా. నా హాబీ కేవలం యాక్టింగ్‌కే పరిమితం కాలేదు. పాటలు కూడా అద్భుతంగా పాడుతా. పలు ఈవెంట్లలోనూ పాడాను. మిమిక్రీ కూడా చేస్తానండి!
నా ఫ్యామిలీ..
భార్య కళావతి సివిల్ సర్జన్. ఇలా నేను డాక్టర్ కాలేదన్న కోరిక నెరవేరింది. కూతురు సోనిక, కుమారుడు అభిలాష్. సోనిక బెంగళూరులో బహుళ జాతి సంస్థలో పనిచేస్తుండగా.. కుమారుడు అక్కడే ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నారు.
మాస్టారు క్లాసే మలుపు తిప్పింది
Published Sun, Nov 10 2013 3:59 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement