మెడిసిన్ సీట్లకు ‘గ్రాంట్’ మెలిక!
సాక్షి, హైదరాబాద్: కొత్తగా పది వేల ఎంబీబీఎస్ సీట్లు.. వైద్య విద్యార్థుల్లో ఎన్నో ఆశలు రేపిన కేంద్ర ప్రభుత్వ ప్రకటన ఇదీ. అయితే ఇందులో మన రాష్ట్రానికి వచ్చే సీట్లపై అప్పుడే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంటే కీలకం. అయితే గతంలో మన సర్కారు వ్యవహార శైలి తాజా అనుమానాలకు కారణమవుతోంది. దేశంలో వైద్యుల కొరత తీర్చేందుకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో పది వేల ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేస్తామని గురువారం కేంద్రం ప్రకటించింది. ఇందులో మన రాష్ట్రానికి కనీసం 700 సీట్లు వచ్చే అవకాశముంది.
కానీ, ఇన్ని సీట్లను మన రాష్ట్రం సాధించుకోగలదా? ఇందుకు అవసరమైన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వగలదా? అనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2010లో భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనలు సరళతరం చేస్తూ రాష్ట్రానికి 500 పీజీ సీట్లు కేటాయించింది. దీంతో పాటు రూ.182.46 కోట్లను మంజూరు చేసింది. తొలి విడతగా 2011లో రూ. 60 కోట్లు మంజూరు చేసింది. దీనికి మ్యాచింగ్ గ్రాంట్ కింద రాష్ట్రం రూ. 15 కోట్లు ఇవ్వాలి. అయితే ఈ నిధులను విడుదల చేయలేదు. అంతేకాక కేంద్రం మంజూరు చేసిన నిధులను ఖర్చు చేయకపోవడంతో తొలి, రెండు విడతల్లో రాష్ట్రానికొచ్చిన సుమారు రూ. 90 కోట్లు వెనక్కు వెళ్లిపోయాయి. ఫలితంగా పీజీ సీట్లు కేటాయించినా తగిన వసతులు కల్పించకపోవడంతో వాటికి గుర్తింపు దక్కలేదు. దీంతో పీజీ వైద్య విద్య పూర్తి చేసిన సుమారు 300 మంది భవితవ్యం ప్రశ్నార్థకమైంది. ఎంబీబీఎస్ సీట్ల విషయంలోనూ ఇదే పునరావృతం అవుతుందేమోననే అనుమానాలు వెంటాడుతున్నాయి.
700 ఎంబీబీఎస్ సీట్లంటే సుమారు రూ. 850 కోట్లు ఖర్చవుతుందని అంచనా. వీటిలో 30 శాతం మ్యాచింగ్ గ్రాంట్ అంటే రూ. 250 కోట్లు రాష్ట్రం భరించాలి. అది కూడా ఎంసీఐ తనిఖీలకు వచ్చే నాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఖర్చు చేసి, విద్యార్థి చదువుకు అనుకూలమైన మౌలిక వసతులు కల్పిస్తేనే ఆ సీట్లకు మోక్షం లభిస్తుంది. లేదంటే ఆ సీట్లకు గుర్తింపు దక్కదు. రాష్ట్రంలో ప్రస్తుతం 15 మెడికల్ కళాశాలలున్నాయి. నెల్లూరులో రూ. 310 కోట్లతో 150 ఎంబీబీఎస్ సీట్ల సామర్థ్యంతో కొత్త కళాశాలను నిర్మిస్తున్నారు. అనంతపురం, విజయవాడ, కర్నూలు జిల్లాలో ఉన్న వైద్య కళాశాలలతో పాటు నాలుగు రిమ్స్‌ల్లో కనీస వసతులు కూడా లేని పరిస్థితి. మౌలిక వసతులను అభివృద్ధి పరిస్తేనే కొత్త సీట్లకు మోక్షం కలుగుతుందని వైద్య రంగ నిపుణులు చెపుతున్నారు.