రోజురోజుకీ అధికార తెలుగుదేశం పార్టీ నేతల ఆగడాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి.
వైఎస్సార్ జిల్లా: రోజురోజుకీ అధికార తెలుగుదేశం పార్టీ నేతల ఆగడాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఇటీవలే మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేశారనే ఘటన మరువక ముందే వైఎస్ఆర్ జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో ప్రాజెక్టులో నీళ్లు రాలేదని నిలదీసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై ఎమ్మెల్యే సాక్షిగా టీడీపీ మండల అధ్యక్షుడు దాడిచేశాడు.
వివరాలు.. మండలంలోని సోమశిల ఎత్తిపోతల ప్రాజెక్టును పరిశీలించడానికి వచ్చిన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జున్ రెడ్డికి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఒంటిమిట్ట మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రమణ.. ప్రాజెక్ట్ నీళ్లు సరిగా విడుదల చేయడం లేదని నిలదీయడంతో.. ఎమ్మెల్యే మేడా కోపోద్రిక్తుడయ్యాడు. అక్కడే ఉన్న ఒంటిమిట్ట మండల టీడీపీ అధ్యక్షుడు ఉపాధ్యాయుడిపై దాడి చేశాడు. ఆ ప్రాంతంలో పోలీసులు ఉన్నా.. ఈ సంఘటనను చూసీ చూడనట్లు వదిలేయడం గమనార్హం.