చిరంజీవి
సాక్షి, అమరావతి : అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని.. మూడు రాజధానుల ఆలోచనను అందరూ స్వాగతించాలని ప్రముఖ సినీనటులు, కేంద్ర మాజీమంత్రి చిరంజీవి రాష్ట్ర ప్రజలను కోరారు. ఇప్పటికే రూ. 3 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇంకో రూ. లక్ష కోట్ల అప్పుతో అమరావతిని నిర్మిస్తే వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన అందరిలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తారన్న నమ్మకం ఉందని చిరంజీవి విశ్వాసం వ్యక్తంచేశారు. ఇదే సమయంలో రాజధాని రైతులలో నెలకొన్న భయాందోళనలు, అభద్రతా భావాన్ని తొలగించాలని సూచించారు. చిరంజీవి విడుదల చేసిన ప్రకటన యథాతథంగా..
‘‘శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులు చూసినా, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక చదివినా, తాజాగా జీఎన్ రావు కన్వీనర్‌గా ఉన్న నిపుణుల కమిటీ సిఫార్సులు చూసినా అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యం అన్నది నిర్వివాదాంశంగా కనిపిస్తోంది. అమరావతి.. శాసన నిర్వాహక, విశాఖపట్నం.. కార్యనిర్వాహక, కర్నూలు.. న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరం ఆహ్వానించాల్సిన సమయం, స్వాగతించాల్సిన సందర్భం ఇది. ఏపీలో వివిధ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులు సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించేవిగా ఉన్నాయి. ఒక్కసారి గతాన్ని పరిశీలిస్తే.. 1956 తర్వాత అభివృద్ధి, పరిపాలన అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమైంది.
2014లో రాష్ట్ర విభజన తర్వాత రిక్తహస్తాలతో అమరావతికి చేరుకున్న ఆంధ్రులు తిరిగి పాత తప్పులను పునరావృతం చేస్తే భావితరాలు క్షమించవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడంవల్ల ఆర్థిక, సామాజిక సమతుల్యత దెబ్బతినడంతో అనేక సమస్యలు పేరుకుపోయాయి. ఇప్పటికే రూ. 3 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇంకో రూ. లక్ష కోట్లు అప్పుతో అమరావతిని నిర్మిస్తే వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన అందరిలో ఉంది. సాగు, తాగునీరు, ఉపాధి అవకాశాల్లేక వలసపోతున్న కూలీల భవిష్యత్, నిరుద్యోగులకి ఈ మూడు రాజధానుల ఆలోచన భద్రతనిస్తుందన్న భరోసా కలుగుతోంది.
ఆ అమరావతిని నిర్మించడానికి ప్రతిపాదించిన రూ. లక్ష కోట్లతో మూడు ప్రాంతాల్లో రాజధానులు నిర్మిస్తే ఎవరినీ విస్మరించలేదన్న భావన కలుగుతుందని అనడంలో ఎలాంటి సందేహంలేదు. అయితే, ఇదే సమయంలో రాజధాని రైతులలో నెలకొన్న భయాందోళనలు, అభద్రతా భావాన్ని తొలగించాలి. వారు నష్టపోకుండా, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆలాగే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అపోహలు, అపార్ధాలు నివారించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుందన్న నమ్మకం ఉంది. ప్రజల ఆకాంక్షలు, సవాళ్లపై నిపుణుల కమిటీ విస్తృతంగా పరిశీలన చేసినట్లు భావిస్తున్నాను. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి రాజధాని సహా అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం నిపుణుల కమిటీ సూచించిన వ్యూహాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళికాబద్ధంగా అమలుచేస్తారని విశ్వసిస్తున్నాను’’ అని చిరంజీవి అందులో వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment