మా రాజీనామాలు ఆమోదించేలా చూడండి: మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఎంపీ పదవులకు తాను, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన రాజీనామాలను తక్షణం ఆమోదించాలని కోరుతూ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మంగళవారం లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ముఖ్య కార్యదర్శి సందీప్ ఖన్నాను కలిసి విన్నవించారు. తమ ఇద్దరి రాజీనామాలు అంగీకరించేలా చూడమని స్పీకర్ తెలియజేయాలని కోరారు.
నిజానికి తమ రాజీనామాలు ఆమోదించాలని కోరేందుకు సోమవారం ఉదయమే మేకపాటి స్పీకర్ అపాయింట్‌మెంట్ కోరారు. అయితే స్పీకర్ కార్యాలయ సిబ్బంది మంగళవారం అపాయింట్‌మెంట్ ఇస్తామని సమాచారం పంపారు. కానీ స్పీకర్ అత్యవసరంగా వేరే రాష్ట్రానికి వెళ్లిపోవడంతో అపాయింట్‌మెంట్ కుదరలేదు. దీంతో నేరుగా పార్లమెంట్‌కు వెళ్లి స్పీకర్ ప్రధాన కార్యదర్శి ఖన్నాని కలిశారు. అనంతరం ఆయన విజయ్‌చౌక్‌లో విలేకరులతో మాట్లాడారు.
‘‘ఎంపీ పదవులకు గత నెలలోనే నేను, జగన్ స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు చేశాం. దీనిపై స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో మా రాజీనామాలు ఆమోదించుకుందామని ఢిల్లీకి వచ్చాం. ఈ రోజు కలిసి ఆమోదం కోరదామనుకుంటే స్పీకర్ పార్లమెంట్ హౌస్‌కి రాలేదు. దీంతో స్పీకర్ ముఖ్య కార్యదర్శి ఖన్నాను కలిశా. రాజీనామాల ప్రతులను ఆయనకు చూపించా, రాజీనామాలు త్వరగా ఆమోదించేలా చూడాలని స్పీకర్‌కు చెప్పాలని కోరా. నా విన్నపాన్ని స్పీకర్‌కు తెలియజేస్తానని ఖన్నా చెప్పారు’’ అని తెలిపారు.
విభజన విషయంలో కాంగ్రెస్ మొదటి ముద్దాయి అయితే, టీడీపీ రెండో ముద్దాయని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏది చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. విభజన విషయంలో అందరికీ న్యాయం చేయాలని చెప్పాం తప్పితే సీమాంధ్రకు అన్యాయం చేయమని తమ పార్టీ ఎన్నడూ చెప్పలేదని స్పష్టంచేశారు. సమన్యాయం చేయడంలో విఫలమైతే సమైక్యాన్నే కొనసాగించాలని తాము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
జగన్ బెయిల్‌ను బాబు జీర్ణించుకోలేకపోతున్నారు
జగన్‌కు బెయిల్ రాకుండా బాబు అన్ని విధాలా ప్రయత్నించారని, బెయిల్ రావడంతో దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని మేకపాటి విమర్శించారు. రాష్ట్ర విభజన విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరి విడ్డూరంగా ఉందన్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రజలు తనకు అక్కర్లేదన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సీమాంధ్రలో పర్యటించినా జనాలెవరూ రాకపోవడంతో ఢిల్లీకి వచ్చారని, ఆయనకు ఇక్కడా పరాభావం తప్పలేదని ఎద్దేవా చేశారు.