సాక్షి, హైదరాబాద్: ఆస్తిపన్ను వసూళ్లలో తీవ్ర నిర్లక్ష్యం కనబరిచిన వంద మున్సిపాలిటీల కమిషనర్లకు మెమోలు జారీ అయ్యాయి. పన్నుల వసూళ్లకు సంబంధించి ఇస్తున్న ఆదేశాలను పట్టించుకోవడం లేదని మున్సిపల్ పరిపాలన సంచాలకులు జనార్దన్‌రెడ్డి ఈ మెమోలు జారీ చేశారు. ఆస్తిపన్ను వసూళ్లు మరీ అధ్వానంగా ఉండడంతో వారు ఎందుకు వసూళ్లలో వెనుకబడ్డారో వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆస్తిపన్ను వసూళ్లలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన కమిషనర్లపై అభియోగాలు ఎందుకు నమోదు చేయరాదో తెలపాలని స్పష్టం చేశారు.
మున్సిపల్ కమిషనర్లతోపాటు, సంబంధిత రీజియన్ డెరైక్టర్లు కూడా తమ వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆస్తిపన్ను వసూళ్లకు సంబంధించి ఇచ్చిన ఆదేశాలను కమిషనర్లు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో ఇప్పటివరకు నయాపైసా కూడా పన్ను వసూళ్లు చేయకపోవడం తీవ్రంగా పరిగణించారు. గ్రామ పంచాయతీల నుంచి నగర పంచాయతీలు, మున్సిపాలిటీలుగా మారిన వాటిలో 22% కంటే తక్కువ పన్ను వసూళ్లు చేసినవే అధికంగా ఉండడం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా మిగిలిన అన్ని మున్సిపాలిటీల్లోనూ పన్నుల వసూళ్ల వివరాలను పరిశీలించగా.. ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది నెలల గడచినా.. పన్నుల వసూళ్ళు ఆశించిన స్థాయిలో పెరగకపోవడం క్షమించరాని అంశమని జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు.
పన్ను వసూలు పట్టించుకోని అధికారులు
ఆస్తిపన్ను వసూళ్లకు సంబంధించి పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డెరైక్టర్, రీజినల్ డెరైక్టర్లు ప్రతీవారం సమీక్షించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా. ఆస్తిపన్ను బకాయిలు ఏమాత్రం పెరగకపోవడం గమనార్హం. మున్సిపాలిటీల్లో 32,18,784 ఆస్తిపన్ను మదింపు(ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్‌మెంట్) జరిగిన గృహాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిమాండ్, గతంలో బకాయిలు కలిపి మున్సిపాలిటీలకు ఈ ఆర్థిక సంవత్సరం రూ. 1,029 కోట్లు వసూలు చేయాలన్నది లక్ష్యం. కాగా ఇప్పటి వరకు వసూలు అయిన మొత్తం కేవలం రూ. 230.88 కోట్లు మాత్రమే. అంటే రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే... ఈ పన్ను వసూళ్లు 22 శాతం మాత్రమే కావడం గమనార్హం. కాగా మేడ్చల్, తిరువూరు, గొల్లప్రోలు, సత్తుపల్లి, నగరి, దుబ్బాక, అనపర్తి, సదాశివపేట్‌లలో 0 నుంచి 1.41% మాత్రమే పన్నులు వసూలు కావడం గమనార్హం.
100 మంది కమిషనర్లకు శ్రీముఖాలు
Published Thu, Jan 2 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM
Advertisement