
హామీలన్నీ ‘మాఫీ’!
ముందు నుయ్యి...వెనుక గొయ్యి అన్న చందంగా ఉంది డ్వాక్రా మహిళల పరిస్థితి. రుణాలు మాఫీ చేస్తామంటూ ఒక పక్క ప్రభుత్వం ప్రకటిస్తుంటే... తీసుకున్న రుణ వాయిదాలు...
- ప్రభుత్వ తీరుపై డ్వాక్రా మహిళల ఆగ్రహం
- రుణ చెల్లింపులకు పెరుగుతున్న ఒత్తిళ్లు
- బ్యాంకర్ల ఒత్తిడికి సాయంగా ఐకేపీ సిబ్బంది
- వాయిదా మొత్తాన్ని పొదుపు ఖాతాలో వేయాలని మెలిక
చోడవరం: ముందు నుయ్యి...వెనుక గొయ్యి అన్న చందంగా ఉంది డ్వాక్రా మహిళల పరిస్థితి. రుణాలు మాఫీ చేస్తామంటూ ఒక పక్క ప్రభుత్వం ప్రకటిస్తుంటే... తీసుకున్న రుణ వాయిదాలు వెంటనే చెల్లించాలంటూ ఐకేపీ అధికారులు మహిళా సంఘాలపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో చంద్రబాబు హామీల సంగతేంటని మహిళలు నేతలను నిలదీస్తున్నారు... డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ప్రకటించింది.
దీంతో ఐదు నెలలుగా డ్వాక్రా మహిళలు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలకు సంబంధించిన నెలవారీ వాయిదాలను చెల్లించకుండా వదిలేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఈ రుణ మాఫీపై ఇప్పుడు మీనమీషాలు లెక్కిస్తోంది. ఇదిగో చేస్తాం... అదిగో ఇస్తామంటూ అధికారం చేపట్టి పదిరోజులైనా నేటికీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీనివల్ల బ్యాంకర్ల నుంచి ఐకెపి అధికారులకు కొంత ఒత్తిడి వస్తుండడంతో వారు మహిళా సంఘాలను రుణాలు చెల్లించాలంటూ సతాయిస్తున్నారు.
జిల్లాలో సుమారు 42 వేల డ్వాక్రా సంఘాలు ఉండగా ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు సుమారు రూ.1200 కోట్ల రుణాలు వివిధ బ్యాంకుల ద్వారా డ్వాక్రా మహిళలు తీసుకున్నాయి. వీటిలో కొంత మేర చెల్లించినప్పటికీ మిగతా రుణమంతా మాఫీకి వర్తిస్తుందని ఎదురుచూస్తున్నారు. అయితే వాయిదాలు మీరుతున్నా మాఫీపై ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో డ్వాక్రా మహిళలపై ఒత్తిడి ప్రారంభమైంది.
రుణ వసూలుకు కొత్త మెలిక : నేరుగా అప్పు చెల్లించమనకుండా ఆ వాయిదా మొత్తాన్ని డ్వాక్రా సంఘాల పొదుపు ఖాతాల్లో వేయాలని ఐకేపీ సిబ్బంది సంఘ సభ్యులకు చెబుతున్నారు. మాఫీ అయ్యే అవకాశం ఉన్నందున రుణాలు చెల్లించకూడదని ఇప్పటికే జిల్లాలో ఉన్న 43 మండల సమైక్యసంఘాలు, 1150 గ్రామైఖ్య సంఘాలు నిర్ణయించుకున్నాయి. అయినా ఐకేపీ సిబ్బంది ఒత్తిడి తీసుకొస్తుండడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏదో సంఘ సభ్యత్వం రద్దు కాకుండా తమ పొదుపు ఖాతాలో నెలవారీ ఒక్కొక్క సభ్యురాలు రూ.50 నుంచి రూ.100 వరకు వేసుకుంటున్నారు. అలాంటిది ఒకేసారి రుణం తాలూకా వాయిదా సొమ్మును ఆ ఖాతాల్లో వేయమని చెప్పడం వెనుక ఆంతర్యమేమిటని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ ప్రభుత్వం మాఫీ చేయకపోతే సంఘాల పొదుపుఖాతాల్లో వేసిన రుణ వాయిదాల మొత్తాన్ని ఆన్‌లైన్‌లో బ్యాంక్ జమ చేసుకునే అవకాశం లేకపోలేదని కొందరు మహిళలు అంటున్నారు.
ఇదిలావుంటే రుణమాఫీ జరిగితే పొదుపు ఖాతాలో వేసిన వాయిదాల సొమ్ము సంఘానికే ఉండి పోతుందని ఏదో విధంగా మహిళలను ఒప్పించే పనిలో ఐకేపీ సిబ్బంది పడ్డారు. ఇప్పటికే చోడవరం, మాడుగుల, ల క్ష్మీపురం, రావికమతం, బుచ్చెయ్యపేట, రోలుగుంట, దేవరాపల్లి, కె.కోటపాడు, చీడికాడ మండలాల్లో ఇందిరా క్రాంతి పథకం సిబ్బంది డ్వాక్రా మహిళలపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. దీనిని డ్వాక్రా మహిళలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.