సాక్షి, విజయనగరం: టీడీపీ ప్రభుత్వ హయాంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను మధ్యాహ్న భోజన కార్మికులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్ జగన్‌ను మధ్యాహ్న భోజన కార్మికులు మంగళవారం ఉదయం కలిసి తమ సమస్యలను జననేతకు విన్నవించారు. ప్రభుత్వం తమకు ఆరు నెలల నుంచి బిల్లులు చెల్లించడంలేదని.. పిల్లలకు కుళ్లిన కోడిగుడ్లను సరఫరా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు తమను రోడ్డున పడేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఇంటికి పంపించి బుద్ధి చెప్తామన్నారు.
జీవో 279ను రద్దు చేయాలని వినతి
జీవో నంబర్ 279ను రద్దు చేయాలని పారిశుద్ధ్య కార్మికులు వైఎస్ జగన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. సీఎం చంద్రబాబు పారిశుద్ధ్య నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంపై మండిపడ్డారు. మహిళా కార్మికులను జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ఎంపీ అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్యే గీత పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రాబోయే ఎన్నికల్లో జననేతకు మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో పనిచేస్తున్న తామంతా జగన్‌కు మద్దతు ఇస్తామని తెలిపారు.
ఉద్యోగాలు తీసేసి రోడ్డున పడేలా చేశారు
చంద్రబాబు నాయుడు తమ ఉద్యోగాలు తీసేసి తమన రోడ్డున పడేలా చేశారని జేఎన్‌టీయూ కాంట్రాక్టు అధ్యాపకులు వైఎస్ జగన్ వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో పాదయాత్ర కొనసాగిసస్తున్న జననేతను కలిసిన అధ్యాపకులు.. వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తమను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు తమ ఉద్యోగాలు తీసేసి రోడ్డున పడేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం జీతాలు పెంచలేదని, టైం స్కేల్ కూడా అమలు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్‌ను కలిసిన 108 ఉద్యోగులు
విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్ జగన్‌ను 108 ఉద్యోగులు కలిశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని జననేతను కోరారు. ప్రభుత్వ నిర్వహణ లోపంతో 108 వాహనాలు మూలన పడ్డాయని వైఎస్ జగన్‌కు తెలిపారు. అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యలపై జననేతకు వినతి పత్రం అందజేశారు.
ఫించన్ కూడా ఇవ్వడం లేదు
పాదయాత్రలో వైఎస్ జగన్‌ను బధిర, మూగ విద్యార్థులు కలిశారు. తమకు కనీసం చదువుకోవడానికి ఉన్నత పాఠశాల, కాలేజీ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో 3 శాతం రిజర్వేషన్ అమలు చేయడం లేదని జననేతకు విన్నవించారు. ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది బధిరులు ఉంటే చంద్రబాబు ప్రభుత్వం ఫించన్ కూడా ఇవ్వడం లేదని వాపోయారు.
జాతిపితకు నివాళులర్పించిన జననేత
మహాత్మా గాంధీ 149వ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులర్పించారు. విజయనగరంలోని పాదయాత్ర శిబిరంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి వైఎస్ జగన్ శ్రద్ధాంజలి ఘటించారు.
మాజీ ప్రధానికి నివాళులు
మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులర్పించారు. విజయనగరంలోని కొండకరకాం క్రాస్ వద్ద పాదయాత్ర శిబిరంలో చిత్రపటానికి లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి వైఎస్ జగన్ పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
మరోవైపు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతున్న విజయనగరం నియోజకవర్గంలో పండగ వాతావరణం నెలకొంది. నేడు జననేత పాదయాత్ర నెల్లిమర్ల నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment