గండేపల్లి, న్యూస్‌లైన్ : మద్యం మత్తులో అర్ధరాత్రి వివాహితపై ఓ వ్యక్తి కర్రతో దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గండేపల్లిలో మల్లేపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి రాఘవ, తన పిల్లలు దుర్గా ప్రసాద్, రామలక్ష్మితో స్థానిక వేంకటేశ్వర రైస్ మిల్లు ఎదురుగా నాలుగేళ్లుగా పూరింట్లో నివసిస్తోంది. కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అదే గ్రామానికి చెందిన కర్రి సూరిబాబు మద్యం తాగొచ్చి శుక్రవారం రాత్రి ఆమెపై కర్రతో దాడి చేశాడు. అడ్డొచ్చిన రామలక్ష్మిపై కూడా దాడి చేశాడు. దీంతో బాధితులు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన సూరిబాబు అదే రోజు అర్ధరాత్రి పూరింట్లో నిద్రిస్తున్న రాఘవపై కత్తితో దాడి చేయడంతో తల, కాళ్లపై తీవ్ర గాలయ్యాయి. స్థానికులు ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించగా, ప్రాథమిక చికిత్స అనంతరం 108లో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై బీవీ రమణ తెలిపారు.
ముందుగా స్పందించి ఉంటే..
ఇలాఉండగా పోలీసులు ముందుగా స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగేది కాదని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం సూరిబాబు మద్యం తాగొచ్చి.. తన భార్య పార్వతిపై చేయిచేసుకున్నాడు. దీంతో ఆమె భయపడి తమ బంధువుల ఇంట్లో తలదాచుకుంది. ఈ క్రమంలో సూరిబాబు బాధితురాలు రాఘవ ఇంటికి వెళ్లి తన భార్య ఎక్కడుందో చెప్పాలంటూ ఆమెను, ఇంట్లో వారిని బయటకు ఈడ్చుకొచ్చి కర్రతో దాడి చేశాడు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఆగ్రహించిన సూరిబాబు ఆమెపై మళ్లీ దాడి చేశాడు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదని స్థానికులు చెప్పారు.
వివాహితపై అర్ధరాత్రి దాడి
Published Mon, Dec 2 2013 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 AM
Advertisement
Advertisement