పై రెండు కుటుంబాలే కాదు.. గుంటూరు జిల్లా నుంచి స్వస్థలాలకు చేరుకున్న 4,641 మంది వలస కూలీల్లోనూ ఎనలేని సంతోషం కన్పిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వీరిని బుధవారం 159 ప్రత్యేక బస్సుల్లో జిల్లాకు తీసుకొచ్చారు. జిల్లాకు చెందిన 24 వేల మందికి పైగా వలస కూలీలు గుంటూరు జిల్లాలో చిక్కుకుపోయారు. వీరిలో అత్యధిక మంది ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలోని వారే. ఖరీఫ్ సీజన్ ముగిసిన తరువాత గుంటూరు జిల్లాకు సుగ్గి వెళ్లారు. అక్కడ మిరప, పత్తి కోత పనులకు వెళ్తుండేవారు. లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం వీరి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం మొదటివిడతలో 4,641 మందిని జిల్లాకు చేర్చింది.
కర్నూలు(సెంట్రల్)/సాక్షి నెట్‌వర్క్ : ఇతని పేరు వీరాంజినేయులు. ఆదోని మండలం దొడ్డనగేరి. రెండెకరాల పొలముంది. ఖరీఫ్‌లో వర్షాధారంగా పత్తి సాగు చేశాడు. అది పూర్తయిన తర్వాత స్థానికంగా పనుల్లేకపోవడంతో భార్యతో కలిసి గుంటూరు జిల్లాకు వలస వెళ్లారు. తొమ్మిదేళ్లలోపు ఇద్దరు పిల్లలను ఊళ్లోనే తల్లిదండ్రుల వద్ద వదిలి వెళ్లారు. గుంటూరు జిల్లాలోని పాలకుర్తి వద్ద మిరప కోత పనులకు వెళ్తుండేవారు. లాక్‌డౌన్ ప్రకటించడంతో అక్కడ పనులు ఆగిపోయాయి. సొంతూరికి వద్దామంటే ఒక్క వాహనమూ అందుబాటులో లేదు. రైళ్లు కూడా నడవలేదు. ఒకవైపు కరోనా భయం..మరోవైపు ఇంటి వద్ద ఉన్న పిల్లలపై బెంగ. ఇక ఇప్పట్లో పిల్లల ముఖం చూస్తామో, లేదోనని తీవ్రంగా కుంగిపోయారు. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి ఇంటికి చేర్చడంతో మళ్లీ ప్రాణం లేచొచ్చినట్లు అయ్యింది. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, మా ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి చొరవ వల్లే మేం మళ్లీ ఇంటికి చేరుకోగలిగాం. వారికి ఎన్నటికీ రుణపడి ఉంటాం’ అని వీరాంజినేయులు అన్నాడు.
ఇతని పేరు నాగరాజు. కోడుమూరు వాసి. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గుంటూరు జిల్లా తాడికొండకు వలస వెళ్లారు. మిరప కోత పనులకు వెళ్లేవారు. పొలాల్లోనే గుడారం వేసుకుని జీవించేవారు. అక్కడికెళ్లిన పది రోజులకే లాక్‌డౌన్ ప్రకటించారు. పనులూ ఆగిపోయాయి. గుడారంలోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. లాక్‌డౌన్ మళ్లీ పొడిగిస్తారన్న వార్తలతో మరింత ఆందోళనకు గురయ్యారు. ఇంతలోనే ముఖ్యమంత్రి చొరవతో కూలీలను ప్రత్యేక బస్సుల్లో సొంతూళ్లకు పంపుతున్నారన్న విషయం తెలిసి ఊరట చెందారు. ప్రత్యేక బస్సులో బుధవారం ఉదయం కోడుమూరుకు చేరుకున్నారు.
మిగిలిన వారినీ తీసుకొస్తాం
గుంటూరు జిల్లాలో చిక్కుకున్న వలస కూలీల్లో మిగిలిన వారిని కూడా స్వస్థలాలకు తీసుకొస్తాం. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలకు థర్మల్ స్క్రీనింగ్ చేసి ఇళ్లకు పంపుతున్నాం. ఎవరి ఆరోగ్యమైన బాగో లేకపోతే వారిని క్వారంటైన్‌కు పంపుతున్నాం. వచ్చిన వారి ఇళ్లు రెడ్‌జోన్లలో ఉంటే వారిని అక్కడికి పంపించం. వారి బంధువులెవరైనా గ్రీన్ జోన్లలో ఉంటే అక్కడికి పంపుతాం. ఎవరూ లేకుంటే రిలీఫ్ సెంటర్లలో ఉంచుతాం.
Comments
Please login to add a commentAdd a comment