సాక్షి, కర్నూలు: ఇంటి దగ్గర వృద్ధురాలైన తల్లి ఎలా ఉందో.. పిల్లలు వేళకు అన్నం తింటున్నారో లేదో.. గర్భిణిగా ఉన్న సతీమణి ఎన్ని అవస్థలు పడుతుందో.. దివ్యాంగుడైన అన్న.. చదువుకుంటున్న తమ్ముడు ఎన్ని కష్టాలు పడుతున్నారో.. లాక్‌డౌన్ నేపథ్యంలో పనిచేసే చోట ఇరుక్కుపోయిన వలస కార్మికుల ఆవేదన ఇదీ.. వీరి కష్టాలకు ప్రభుత్వం చలించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా నుంచి గురువారం 225 బస్సుల్లో 6,980 మంది వలస కూలీలను జిల్లాకు తీసుకొచ్చినట్లు కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు.
బుధ, గురువారాల్లో మొత్తం 11,621 మంది జిల్లాకు చేరుకున్నట్లు పేర్కొన్నారు. గురువారం వచ్చిన వారు జిల్లాలోని ఆదోని డివిజన్, కర్నూలు డివిజన్లలోని 31 మండలాలకు చెందిన వారిని కలెక్టర్ వివరించారు. వచ్చిన వారందరినీ ధర్మల్ స్క్రీనింగ్ చేసి ఇళ్లకు పంపుతున్నట్లు తెలిపారు. కరోనా లక్షణాలు ఉంటే క్వారంటైన్లకు తరలించి పరీక్షలు చేయిస్తామని చెప్పారు. గుంటూరు జిల్లాలో కర్నూలులోని వివిధ మండలాలకు చెందిన 13,015 మంది వలస కూలీలు ఉన్నారని, వారందరినీ ఒకటి, రెండు రోజుల్లో వారి స్వస్థలాలకు చేర్చుతామని తెలిపారు. ఇదిలా ఉండగా స్వస్థలాలకు చేరుకున్న వలస కూలీలు..కుటుంబ సభ్యులను చూసి సంతోషంలో మునిగిపోయారు. పిల్లలను అక్కున చేర్చుకొని ఆనంద పరవశులయ్యారు. వలస కూలీలను ఇంటిని చేర్చిన ప్రభుత్వానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు. (అంత్యక్రియలను అడ్డుకోవడం అమానవీయం)
► ఆస్పరి మండలంలోని 1,423 మంది..42 ఆర్టీసీ బస్సుల్లో స్వస్థలాలకు చేరుకున్నట్లు తహసీల్దార్ నిత్యానందరాజు, డాక్టర్ రఘురామిరెడ్డి తెలిపారు.
► ఎమ్మిగనూరు పట్టణంలోని నలందా బీఈడీ కాలేజీ క్వారంటైన్‌లో 400 మంది కూలీలకు ఆశ్రయం కల్పించారు.
► 31బస్సులలో 1,060 మంది కోసిగికి చేరుకున్నారు. వీరికి క్వారంటైన్ దగ్గర వైద్య పరీక్షలు నిర్వహించి స్వగ్రామాలకు పంపించారు.
► మంత్రాలయం మండల పరిధిలోని చిలకలడోణ గ్రామ శివారులోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో 300 మంది కూలీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
► డోన్ క్వారంటైన్ సెంటర్‌లో 30మంది కూలీలకు వైద్యులు చెన్నకేశవులు, ముంతాజ్‌ల ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో వారి స్వగ్రామాలకు తరలించారు.
► కృష్ణగిరి మండలం ఎస్‌హెచ్ ఎర్రగుడికి చెందిన 42 మంది కూలీలు ఇంటికి చేరుకున్నట్లు తహసీల్దార్ జాకీర్‌హుసేన్ తెలిపారు.
► సి.బెళగల్ మండలానికి చెందిన 810 మంది స్వగ్రామాలకు చేరుకున్నారని తహసీల్దార్ శివశంకర్‌నాయక్, ఎంపీడీఓ రాముడు తెలిపారు. కూలీలకు డాక్టర్లు రంగస్వామిరెడ్డి, దేవానంద్ వైద్య పరీక్షలు నిర్వహించి.. సలహాలు, సూచనలు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment