నరేంద్ర మోడీని ప్రధాని కానివ్వం: అసదుద్దీన్
గుజరాత్‌లో లౌకికవాదాన్ని మంటగలిపిన వ్యక్తిని దేశ ప్రధానిగా చేయటానికి జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొడతామని మజ్లీస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ఒవైసీ పేర్కొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ఆదివారం రాత్రి దారుసలాంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, కార్యదర్శులకు ఏర్పాటు చేసిన ఈద్ మిలాబ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మనోభావాలను గాయపర్చిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనతో ముస్లింలకు ఒరిగేదేమి లేదని, కేవలం మతతత్వ శక్తులకే లబ్ధి చేకూరుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజనను ఎంఐఎం వ్యతిరేకించిందన్నారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీని ముందుకు తెచ్చి, హైదరాబాద్ నగరం నుంచే ఎన్నికల ప్రచారానికి పంపటం వెనుక ఉద్దేశమేమిటని ఆయన ప్రశ్నించారు. మోడీ రాక సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు బావమరిది, కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్రమంత్రి చిరంజీవి బావమరిది, ఇతర ప్రముఖులు, పలు రాజకీయ నాయకులు హోటల్‌లో మోడీని కలవటాన్ని బట్టి.. వారు ఎంతవరకు లౌకికవాదాన్ని పాటిస్తున్నారో అర్థమవుతోందన్నారు. రాబోయే ఆరేడు నెలల్లో ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, మజ్లిస్ కార్యకర్తలు ఎన్నికలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 2009లో మజ్లిస్ పార్టీని ఓడించటానికి సెక్యులర్ ముసుగు ధరించిన పార్టీలు ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి సాగలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ అన్ని ప్రాంతాల్లో తమ అభ్యర్థులను నిలబెడుతుందని ప్రకటించారు. ఈ నెల 17న సలాఉద్దీన్ ఒవైసీ వర్ధంతి సభ సందర్భంగా పార్టీ తన కార్యాచరణను ప్రకటిస్తుందని తెలిపారు.