సాక్షి, అమరావతి: డిస్నీల్యాండ్.. వండర్‌ల్యాండ్.. స్నోల్యాండ్.. ఇంకా చెప్పాలంటే హ్యాయ్‌ల్యాండ్! వినోదం కలిగించే ఈ వింతలోకంలో కాసేపు విహరించడం వరకు బాగానే ఉంటుంది. బయటకు వచ్చాక తేరుకుని ఈ లోకంలోకి వస్తాం. మరి ఇప్పుడు వీటి సరసన ‘వెల్‌కమ్ గ్యాలరీ’ కూడా చేరనుంది.
గ్రాఫిక్స్ సరిపోవనే...
నాలుగున్నరేళ్లుగా రాజధాని అమరావతికి ఒక్క ఇటుక కూడా వేయకుండా డజన్ల కొద్దీ గ్రాఫిక్స్, భారీ వ్యయంతో తాత్కాలిక కట్టడాలు, కబుర్లతో కాలక్షేపం చేసిన టీడీపీ సర్కారు ఎన్నికలకు రెండు నెలల ముందు మరో డ్రామాకు తెర తీసింది. ఈసారి సినీ దర్శకులను తలదన్నేలా అదిరిపోయే స్కెచ్ గీసింది. దాదాపు రూ.45 కోట్ల భారీ వ్యయంతో మినీ రాజధాని ఊహాచిత్రాన్ని సినిమాల తరహాలో సెట్టింగ్‌లతో ఆవిష్కరించేందుకు రంగం సిద్ధమైంది. సందర్శకులను ఆకట్టుకునేందుకు స్టార్టప్ ఏరియా ప్రాంతంలో వెల్‌కమ్ గ్యాలరీ పేరుతో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తాము నిర్మించే రాజధాని ఎలా ఉంటుందో చెప్పేందుకు కేవలం గ్రాఫిక్స్ సరిపోవని, మయ సభ లాంటి సెట్టింగ్‌లే సరైనవనే నిర్ణయానికి సర్కారు వచ్చింది. ఈ సెట్టింగ్‌లు రూపొందించే కన్సల్టెంట్లకు మరో రూ.43 లక్షల దాకా ఫీజు చెల్లించేందుకు సిద్ధపడటం గమనార్హం.
ఎక్కడకు వెళితే అక్కడిలా కడతానంటూ..
అంతర్జాతీయ స్థాయిలో అమరావతిని నిర్మిస్తామంటూ వివిధ దేశాల్లో సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో పలు దఫాలుగా పర్యటించడం తెలిసిందే. ఆయన ఎక్కడకు వెళితే ఆ ప్రాంతం మాదిరిగా రాజధానిని కడతానంటూ ప్రకటించినా కనీసం ఒక్క ఇటుక కూడా వేయలేదు. ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు సెట్టింగ్‌లతో సర్కారు సిద్ధమైందని పరిశీలకులు పేర్కొంటున్నారు. రాజధాని ప్రాంతంలో ఇంతవరకూ ఏమీ లేకపోయినా ఏదో జరిగిపోతున్నట్లుగా ప్రచారం చేసేందుకు ఉపక్రమించిందని వ్యాఖ్యానిస్తున్నారు.
భూములిచ్చిన రైతులను గాలికి వదిలేసి ‘రియల్’ వ్యాపారం..
వెల్‌కమ్ గ్యాలరీ నిర్మాణంతో ఏదో జరిగిపోతోందనే భ్రమను కల్పించడం ఒకటి కాగా మరో పక్క దీన్ని చూపించి వ్యాపారం పెంచుకోవడమే తప్ప స్టార్టప్ ఏరియా త్వరగా ప్రారంభించడానికి కాదని సింగపూర్ ప్రతినిధులు, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారుల మధ్య జరిగిన చర్చల సారాంశం పత్రంలో పేర్కొనడం గమనార్హం. రాజధానికి భూములిచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారించని సర్కారు రైతుల భూములను మార్కెటింగ్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా రూ.కోట్లు కొల్లకొట్టడంపైనే దృష్టి పెట్టిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే వెల్‌కమ్ గ్యాలరీని తెరపైకి తెచ్చిందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
నాలుగు వేల చ.మీ.లలో గ్యాలరీ
రాజధాని స్టార్టప్ ఏరియాలో సింగపూర్ కంపెనీలకు కేటాయించిన 50 ఎకరాల్లో ఉత్ప్రేరక నిర్మాణాన్ని చేపట్టాలని తొలుత నిర్ణయించారు. అయితే ఇప్పుడు రెండు హెక్టార్లలో 4 వేల చ.మీ. విస్తీర్ణంలో వెల్‌కమ్ గ్యాలరీని ఊహా చిత్రాలతో ఏర్పాటు చేసేందుకు సర్కారు సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇటీవల సింగపూర్‌లో జరిగిన అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సమావేశంలో కన్సల్టెన్సీని కూడా ఎంపిక చేయడం గమనార్హం. వెల్‌కమ్ గ్యాలరీ డిజైన్ రూపకల్పన కోసం ‘వీటీపీ కాస్ట్ అడ్వయిజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ను ఎంపిక చేశారు. కన్సల్టెన్సీ ఫీజు కింద ప్రాజెక్టు వ్యయంలో 0.95 శాతం చెల్లించాలని నిర్ణయించారు. అంటే కన్సల్టెన్సీ ఫీజుగా రూ.42.48 లక్షలు చెల్లించనున్నారు. వెల్‌కమ్ గ్యాలరీ సెట్టింగ్‌ల తయారీకి రూ.44.50 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. సందర్శకులు, ప్రజలను ఆకట్టుకోవడమే వెల్‌కమ్ గ్యాలరీ ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.
అదంతా ఊహాలోకమే..!
రాజధానిలో స్టార్ట్‌అప్ ఏరియా పేరుతో సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు కారుచౌకగా 1,691 ఎకరాలను రాసి ఇచ్చేసిన చంద్రబాబు సర్కారు నాలుగున్నరేళ్లుగా ఎటువంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టలేదు. ఇప్పుడు స్టార్ట్‌అప్ ఏరియా ప్రాజెక్టులో వెల్‌కమ్ గ్యాలరీ నిర్మాణం అంటూ కొత్త కట్టడాన్ని తెరమీదకు తెచ్చింది. వాస్తవంగా ఈ వెల్‌కమ్ గ్యాలరీ అంతా సెట్టింగులతో మినీ రాజధాని ఊహాచిత్రాన్ని చూపించడమేనని ఓ ఉన్నతాధికారి తెలిపారు. దీన్ని చూపిస్తూ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుల్లో రూ.కోట్లు కొల్లగొట్టేందుకు పథకం వేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment