సాక్షి, అమరావతి: సింగపూర్ కంపెనీల ముసుగు తొలిగిపోవడంతో అమరావతి కేంద్రంగా సాగిన భూదందా విస్మయపరుస్తోంది. చంద్రబాబు సింగపూర్ పర్యటనలు.. ప్రైవేట్ కంపెనీలతో ఎంవోయూలు.. స్విస్ ఛాలెంజ్ ఒప్పందాల వెనుక తీగను లాగుతుంటే కరకట్ట ఇంట్లో అవినీతి డొంక కదులుతోంది. అమరావతి మాస్టర్‌ప్లాన్, సీడ్ క్యాపిటల్ పాన్ ఫైళ్లను తిరగేస్తుంటే బినామీల పేరుతో చంద్రబాబు, నారాయణ కొల్లగొట్టిన భూముల దస్త్రాలు బయటపడుతున్నాయి. సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణతో భూ దోపిడీ మొత్తం బయటపడుతోంది.
కమిటీలో సింగపూర్ కంపెనీ ప్రతినిధి
2014 జూన్‌లో అధికారం చేపట్టగానే రాజధాని పేరిట చంద్రబాబు భారీ భూదోపిడీకి పన్నాగాన్ని రూపొందించారు. 2015 జూలైలో రాజధాని సలహా కమిటీని నియమించి పొంగూరు నారాయణ, సుజనా చౌదరి, గల్లా జయదేవ్‌తోపాటు సింగపూర్ కంపెనీ ప్రతినిధికి స్థానం కల్పించడం గమనార్హం. అంతర్జాతీయ కాంపిటీటివ్ బిడ్డింగ్‌కు వెళ్తున్నందున విదేశీ కంపెనీ ప్రతినిధిని సభ్యుడిగా నియమించడంపై అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అభ్యంతరం తెలిపినా చంద్రబాబు పట్టించుకోలేదు. సింగపూర్ కంపెనీకి రాజధాని ప్రాంత ఎంపిక బాధ్యతను అప్పగించడం ద్వారా భారీ భూదోపిడీకి అప్పుడే పథకం వేశారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనేబిలింగ్ యాక్ట్‌ను కూడా టీడీపీ సర్కారు ఉల్లంఘించింది. ఓపెన్ కాంపిటీషన్ ద్వారా డెవలపర్‌ను ఎంపిక చేయాలన్న నిబంధనను చంద్రబాబు ఖాతరు చేయలేదు.
కేంద్రం అనుమతి లేదు.. టెండర్లూ లేవు
2014 నవంబరులో చంద్రబాబు సింగపూర్ పర్యటనలోనే భూదోపిడీకి స్కెచ్ వేశారు. ఆ వెంటనే డిసెంబరులో రాజధాని మాస్టర్‌ప్లాన్ రూపొందించేందుకు సింగపూర్ కంపెనీతో చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా ఎంవోయూ కుదుర్చుకుంది. విదేశీ కంపెనీతో చేసుకునే ఒప్పందాలకు కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం. అయితే కేంద్రం అనుమతి లేకుండానే ఎంవోయూ కుదుర్చుకోవడం గమనార్హం. ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటున్నట్లు అప్పటి సీఎం చంద్రబాబు బుకాయిస్తూ వచ్చారు. తద్వారా ఇతర కంపెనీలు పోటీకి రాకుండా నిరోధించారు.
కానీ సంబంధిత శాఖల నోట్ ఫైల్స్‌లో ఎక్కడా సింగపూర్ ప్రభుత్వం అనే ప్రస్తావనే లేదు. చివరికి చంద్రబాబు ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది సింగపూర్ ప్రభుత్వంతో కాకుండా ఓ ప్రైవేట్ కంపెనీతో కావడం గమనార్హం. ఇక రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైన సీడ్ క్యాపిటల్ ఎంపిక కోసం ప్రత్యేకంగా మాస్టర్ ప్లానర్‌ను చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా ఎంపిక చేసింది. అందుకోసం కనీసం టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టలేదు. సింగపూర్‌కే చెందిన కంపెనీలను మాస్టర్ డెవలపర్‌గా ఎంపిక చేయాలని ఎంవోయూలో స్పష్టం చేశారు. రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందించే కంపెనీ, సీడ్ క్యాపిటల్ మాస్టర్ డెవలపర్ ఎవరన్నది చంద్రబాబు ముందుగానే నిర్ణయించేశారు.
2015 జనవరిలోనే అమరావతి మ్యాపులు..
రాజధానిలో కీలకమైన సీడ్ క్యాపిటల్ ప్రాంతం ఎంపికలో చంద్రబాబు తన పన్నాగాన్ని అమలులోకి తెచ్చారు. విజయవాడ–గుంటూరు–తెనాలి– మంగళగిరి(వీజీటీఎం) పరిధిలోని జోనింగ్ మ్యాపులన్నీ 2015 జనవరిలోనే సింగపూర్ మాస్టర్ డెవలపర్‌కు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ ప్రభుత్వం అప్పగించేసింది. ఆ మ్యాపుల్లో పేర్కొన్న ప్రాంతాల్లోనే రాజధాని, సీడ్ క్యాపిటల్‌ను ఎంపిక చేయాలని చంద్రబాబు ప్రభుత్వం స్పష్టం చేసింది. కృష్ణా నదికి అభిముఖంగా ఉద్దండరాయునిపాలెం, తాళ్లాయపాలెం, లింగాయపాలెం గ్రామాల పరిధిలో సీడ్ క్యాపిటల్‌ను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. అంటే రాజధాని, సీడ్ క్యాపిటల్ ఏ మండలాలు, గ్రామాల పరిధిలో రానున్నాయో చంద్రబాబు, నారాయణ, వారి బినామీలకు ముందుగానే తెలుసన్నది స్పష్టమైంది. అనంతరం సింగపూర్ కంపెనీ సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్‌ను 2015 జూలైలో ప్రభుత్వానికి సమర్పించి కథ ముగించింది.
పచ్చ ముఠా గుప్పిట్లో సీడ్ క్యాపిటల్
2015 జనవరిలోనే సీడ్ క్యాపిటల్ ఎక్కడ రానుందో తెలిసిన చంద్రబాబు, నారాయణ తమ బినామీలను రంగంలోకి దింపారు. ఆ ప్రాంతంలో అతి తక్కువ ధరకు భూములను భారీగా కొనుగోలు చేశారు. సీఐడీ దర్యాప్తులో ఈ బినామీ లావాదేవీలు వెలుగులోకి వస్తున్నాయి. నారాయణ తన బినామీలు, బంధువుల పేరిట 65.50 ఎకరాలు కొనుగోలు చేసినట్లు సీఐడీ విచారణలో వెల్లడైంది. నారాయణ భార్య రమాదేవి, అల్లుడు డైరెక్టర్లుగా ఏర్పాటైన ఎన్‌స్పైరా కంపెనీ నుంచి నిధులను తమ బంధువులు, బినామీల ఖాతాల్లోకి మళ్లించారు.
రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరును బినామీగా పెట్టుకుని కూడా నారాయణ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు. ఆ విధంగా కొనుగోలు చేసిన 65.50 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్డీఏకు ఇచ్చారు. అందుకు ప్రతిగా ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీ కింద సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో అత్యంత విలువైన 75,888 చదరపు గజాల స్థలాలు పొందారు. పూలింగ్ ప్యాకేజీ కింద ఏటా సీఆర్‌డీఏ ఇప్పటివరకు చెల్లించిన రూ.1.92 కోట్ల కౌలు మొత్తం ఎన్‌స్పైరా ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇదే రీతిలో చంద్రబాబు బినామీలు, సన్నిహితులు సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో భారీగా భూములు గుప్పిట పట్టారు. దీనిపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలో మరిన్ని బినామీ లావాదేవీలు బహిర్గతం కానున్నాయి.
స్విస్ ఛాలెంజ్ ముసుగులో 1,691 ఎకరాల దోపిడీ
తమ దోపిడీకి మార్గం సుగమం చేసేలా రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన చట్టానికి చంద్రబాబు ప్రభుత్వం ఇష్టానుసారం సవరణలు చేసింది. ఓపెన్ కాంపిటీషన్ విధానాన్ని పక్కనపెట్టేసి స్విస్ చాలెంజ్ విధానంలో సీడ్ క్యాపిటల్ డెవలప్‌మెంట్ ఒప్పందం చేసుకుంది. కౌంటర్ చాలెంజ్‌కు ఇతర కంపెనీలకు అవకాశం లేకుండా చేసి సింగపూర్ కంపెనికి స్విస్ ఛాలెంజ్ కింద ఏకపక్షంగా కట్టబెట్టేసింది. సీడ్ క్యాపిటల్ అంచనా వ్యయం రూ.3,137 కోట్లు కాగా నీతి ఆయోగ్ మార్గదర్శకాల ప్రకారం అందులో 25 శాతం అంటే రూ.784 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు బిడ్డింగ్ అర్హత ఉంటుంది.
చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కనీసం రూ.2 వేల కోట్ల టర్నోవర్ ఉండటాన్ని అర్హతగా నిర్ణయించడం గమనార్హం. తద్వారా ఇతర కంపెనీలు ఏవీ పోటీకి రాకుండా కట్టడి చేసింది. ఇక సీడ్ క్యాపిటల్ కింద 1,691 ఎకరాల్లో నిర్మాణాలను సింగపూర్ కంపెనీకి కాంట్రాక్టు అప్పగించారు. కానీ అందులో సింగపూర్ కంపెనీ నిర్మించేది కేవలం 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవనం మాత్రమే. అంటే మిగిలిన భూమి అంతా సింగపూర్ కంపెనీకే అప్పగించేశారు. ఆ ప్రకారం ఆ భూమిని ప్లాట్లు వేసుకుని అమ్ముకునే హక్కు కల్పించారు. సింగపూర్ కంపెనీ ముసుగులో చంద్రబాబు, ఆయన బినామీలు భూములను కాజేసేందుకే ఈ పథకం వేశారు.
‘ఇన్నర్’ మెలికలు
గత సర్కారు పెద్దల ఆదేశాలతో ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో కీలక మార్పులు జరిగాయి. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి కంతేరు, కాజాలో ఉన్న భూములను ఆనుకుని ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించేలా అలైన్‌మెంట్ రూపొందించారు. సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీ ద్వారా రూపొందించిన అమరావతి మాస్టర్‌ప్లాన్‌లోనే ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్ రోడ్ డిజైన్‌ను చంద్రబాబు ప్రభుత్వం ముందుగానే చేర్చింది. అంటే అప్పటికే ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్‌మెంట్ ఎలా ఉండాలన్నది నిర్ధారణ అయిపోయింది. సీఆర్‌డీఏ ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా తెరపైకి తెచ్చి ఆమోదించారు. కంతేరు, కాజాలో లింగమనేని కుటుంబానికి 355 ఎకరాలున్నాయి. ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను ఆనుకుని హెరిటేజ్ ఫుడ్స్‌కు ఒకచోట 9 ఎకరాలు, మరో చోట నాలుగు ఎకరాలు ఉండటం గమనార్హం.
పాపాల్లో పవన్‌కూ భాగం
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా ఈ ఇన్నర్‌రింగ్ రోడ్డు అవినీతి పాపంలో చంద్రబాబు వాటా కల్పించారు. కాజా వద్ద ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌కు సమీపంలో పవన్‌కల్యాణ్‌కు 2.4 ఎకరాలున్నాయి. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్లు చూపించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్ కల్యాణ్‌కు ఇవ్వడం గమనార్హం.
అమాంతం పెరిగిన విలువ
ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ ఖరారుకు ముందు లింగమనేని కుటుంబం ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.8 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.50 లక్షలు ఉంది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లు. ఇక ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ ఖరారు తరువాత ఎకరం రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. మార్కెట్ ధర ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. అంటే 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది.
అమరావతి పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి నిర్మాణం పూర్తయితే రూ.54 కోట్లకు చేరుతుందని తేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకున్న మరో నాలుగు ఎకరాల విలువ కూడా రూ.24 కోట్లకు చేరుతుంది.
ఇది కూడా చదవండి: బాబు చెప్తే ఎవరికి విడాకులు ఇవ్వమన్నా ఇస్తాడు.. పవన్ గాలి తీసేసిన సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment