
సదస్సులో మాట్లాడుతున్న మంత్రి సురేష్
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి : చదువుకు పేదరికం అడ్డుకారాదన్న ఉద్దేశంతో ఏపీలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు. నూతన విద్యా విధానం ముసాయిదా బిల్లుపై చర్చించేందుకు శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ అధ్యక్షతన జరిగిన అన్ని రాష్ట్రాల విద్యా శాఖ మంత్రుల సమావేశంలో ఆదిమూలపు సురేష్, రాష్ట్ర విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ పాల్గొన్నారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు నాంది పలికిన అమ్మ ఒడి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవశ్యకత ఉందని వివరించారు. అలాగే ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 6,456 కోట్ల నిధులు వెచ్చిస్తోందని, ఈ పథకానికి కేంద్రం తరఫున కూడా తగిన సాయం చేయాలని కోరారు.
ఇక ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికసదుపాయాల కల్పనకు ప్రభుత్వం వెచ్చించే నిధులపై జీఎస్టీని మినహాయించాలని కోరారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలను స్కూళ్లకు పంపే పేదలకు జాతీయ ఉపాధి హామీ పథకంలో ప్రాధాన్యం ఇవ్వడాన్ని నూతన విద్యా విధానంలో పొందుపరచాలన్నారు. ఇక ఏపీలో లోక్‌సభ నియోజకవర్గాల కేంద్రంగా వృత్తి విద్యా కాలేజీలు, స్థానికంగా ఉన్న పరిశ్రమలతో అనుబంధంగా నైపుణ్యాల శిక్షణ కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీన్ని కూడా జాతీయ స్థాయిలో అమలు చేయాలని తెలిపారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి అవసరమైన నిధులు విడుదలలో చొరవ చూపాలని కోరుతూ రమేష్ పోఖ్రియాల్‌ను ప్రత్యేకంగా కలసి ఆదిమూలపు సురేష్ వినతిపత్రం ఇచ్చారు. ఆగస్టు 29న జరిగిన సమావేశంలో కోరిన అంశాలను త్వరితగతిన మంజూరు చేయాలన్నారు.