సాక్షి, అమరావతి : ఇంటర్‌లో గ్రేడింగ్‌తో పాటు మార్కులు కూడా ఇస్తామని, లేకుంటే పొరుగు రాష్ట్రాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. బుధవారం పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై వెలగపూడిలోని సచివాలయంలో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈఓలు, ఆర్ఐఓలతో చర్చించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ పరీక్షలు మార్చి 4 నుంచి 23వ తేదీ వరకు 20 రోజుల పాటు 1411 పరీక్ష కేంద్రాల్లో జరుగుతాయని చెప్పారు. పదో తరగతి పరీక్షలు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. 6 లక్షల 30 వేల మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,900 కేంద్రాలు ఏర్పాటు చేశామని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు అవుతుందని తెలిపారు. అలాగే పరీక్ష సమయంలో స్థానికంగా ఉండే జిరాక్స్ కేంద్రాలు కూడా మూసివేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ విధానంలో కేటాయిస్తామని తెలిపారు.
‘‘ 1411 ఇంటర్, 2900 పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో ఎక్కడా విద్యార్థులు కింద కూర్చుని పరీక్ష రాసే అవస్థలు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చాము. పదో తరగతి పరీక్షల్లో స్వల్ప మార్పులు చేసినందున విద్యార్థులను సిద్ధం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. హాల్ టికెట్లు వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి హాల్ టికెట్ పైనా క్యూ ఆర్ కోడ్ ఉంటుంది. ప్రతి విద్యార్థి హాల్ టికెట్‌ను తనిఖీ చేస్తాం. పరీక్ష కేంద్రాలు తెలుసుకునేందుకు ఓ యాప్‌ను సిద్ధం చేశాం. విద్యార్థులు కూర్చునే వెసులుబాటు కల్పించాం. కాపీయింగ్ నిరోధానికి సీసీ కెమెరాలు కూడా పెడుతున్నాం. పరీక్ష పత్రాలు లీకేజీ లేకుండా ఉండేందుకు చీఫ్ సూపర్ వైజర్ మినహా ఎవరి వద్దా మొబైల్ ఫోన్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను కూడా ఇన్విజిలేటర్లుగా వినియోగించుకుంటున్నామ’ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment