
సాక్షి, విశాఖ: విశాఖ పశ్చిమనియోజక వర్గపర్యటనలో భాగంగా పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. పశ్చిమ నియోజకవర్గం ఐటీఐ జంక్షన్ వద్ద రూ. 60లక్షల వ్యయముతో డ్రైనేజీలు, సీసీరోడ్ల నిర్మాణం, స్మశాన వాటికలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రానున్న సంస్థాగత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం ఖాయమని.. భారీ మెజార్టీ సాధించి ముఖ్యమంత్రికి బహుమతిగా ఇస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. రానున్న ఐదేళ్లలో 25 లక్షల ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారని వెల్లడించారు. దివంగత మహానేత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో 25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టారని గుర్తుచేశారు. అవినీతికి తావులేకుండా లక్షన్నర ఉద్యోగాలు అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు.
చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు..
పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారని వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి.. చంద్రబాబు ఓర్వ లేకపోతున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఎన్నో అక్రమాలు జరిగాయని.. అవినీతిని రూపుమాపడానికి ప్రజలంతా ప్రభుత్వంతో సహకరించాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయసాధనకు.. వైఎస్ జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారని..రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఎన్నో గొప్ప పథకాలు రూపొందించారని పేర్కొన్నారు. ఏ సమాజం అయినా విద్యతోనే అభివృద్ధి చెందుతుందని.. విద్యలో ఏపీ దేశంలోనే ప్రథమస్థానంలో నిలవాలన్నదే సీఎం జగన్ సంకల్పమని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు పేదలకు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నాలుగు లక్షల మందికి రైతు భరోసా అందిస్తున్నామని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతలా భావిస్తున్నామని మంత్రి అవంతి అన్నారు.