
జనవరి నుంచి రాజధాని భవనాల నిర్మాణం
వచ్చే జనవరి నుంచి రాజధానిలో ప్రధాన భవనాల నిర్మాణం ప్రారంభమవుతుందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు.
సాక్షి ఫొటో ఫీచర్ కథనంపై మంత్రి నారాయణ
సాక్షి, అమరావతి: వచ్చే జనవరి నుంచి రాజధానిలో ప్రధాన భవనాల నిర్మాణం ప్రారంభమవుతుందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణం ఇంకా ప్రారంభం కాని వైనంపై సోమవారం సాక్షిలో ప్రచురితమైన ఫొటో ఫీచర్ కథనంపై ఆయన స్పందించి ప్రకటన విడుదల చేశారు. ముందుగా అనుకున్న ప్రకారం అనుకున్న సమయానికి మొదటి విడత నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు.
రాజధానిలో కేవలం శిలాఫలకాలకే పరిమితమయ్యామా? లేక అద్భుతమైన పురోగతి సాధించామా? అనే విషయం ప్రజలందరికీ తెలుసని, అమరావతి నిర్మాణంలో వైఎస్సార్‌సీపీ ఇష్టానుసారం విమర్శలు చేస్తోందన్నారు. ఆరు నెలల్లో ఆరు లక్షల చదరపు అడుగుల భవనాలు నిర్మించామని, సీఆర్‌డీఏ చట్టం ప్రకారం రైతులందరికీ ప్లాట్లు కేటాయించే ప్రక్రియ ప్రారంభమైందని, నవంబర్ చివరి నాటికి ఇది పూర్తవుతుందన్నారు.