పెనమలూరు: రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన పొక్లెయిన్‌ను తరలించకుండా అడ్డుకోవడమే కాకుండా కృష్ణాజిల్లా, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ దానిని తన గెస్ట్‌హౌస్‌లో దాచిన ఘటన స్థానికంగా ఉద్రిక్తత సృష్టించింది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మీషాసింగ్‌తో ఎమ్మెల్యే వాదనకు దిగారు. ఈ నేపథ్యంలో సబ్ కలెక్టర్.. పొక్లెయిన్‌ను సీజ్ చేయాలని, దానిని తరలించిన వారిని, భూమి తవ్వకాలు, చదును చేసినవారిని అరెస్టు చేయాలని ఆదేశించినా శనివారం రాత్రి వరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. వివరాలిలా ఉన్నాయి. పెనమలూరు మండలం వణుకూరులో రూ.10 కోట్లు విలువ చేసే 2.84 ఎకరాల పుల్లేరు కట్టభూమిపై టీడీపీ నాయకులు కొందరు కన్నేశారు. కట్టను తవ్వుతున్న వైనంపై ‘సాక్షి’లో శనివారం కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన విజయవాడ సబ్ కలెక్టర్ మిషాసింగ్ పొక్లెయిన్‌ను సీజ్ చేయాలని పెనమలూరు తహసీల్దార్ మురళీకృష్ణ, సిబ్బందిని ఆదేశించారు. దీంతో అధికారులు సదరు భూమిలో పనులు కొనసాగిస్తున్న పొక్లెయిన్‌ను సీజ్ చేశారు. వాహనంలో తరలిస్తుండగా ఎమ్మెల్యే ప్రసాద్ తన గన్‌మెన్‌లతో అక్కడికి వచ్చారు. పొక్లెయిన్‌ను తరలిస్తే సహించేది లేదంటూ దానిని పోరంకిలోని తన గెస్ట్‌హౌస్ కం ఆఫీస్ వద్దకు తరలించి దాచేశారు.
సబ్ కలెక్టర్ ఆదేశించినా అరెస్టుల్లేవు..!
ఈ నేపథ్యంలో వణుకూరు వచ్చిన సబ్ కలెక్టర్ పోలీసులను పిలిపించి పొక్లెయిన్ ఎక్కడున్నా సీజ్ చేయాలని ఆదేశించారు. పోలీసులు చేతులెత్తేయటంతో ఎమ్మెల్యే గెస్ట్‌హౌస్‌లో పొక్లెయిన్ ఉందనే అనుమానంతో ఆమె అక్కడికి వెళ్లారు. పొక్లెయిన్‌ను అప్పగించాలని ఎమ్మెల్యే ప్రసాద్‌ను కోరారు. అప్పగించేది లేదని, అవసరమైతే తనను అరెస్టు చేసుకోండంటూ ఆయన ఆవేశంగా సమాధానం ఇచ్చారు. అయితే తనకు పొక్లెయిన్ అయినా అప్పగించాలని లేదా రూ.2 లక్షలు జరిమానా అయినా చెల్లించాలని సబ్ కలెక్టర్ పట్టుబట్టారు. ఈ లోగా సెంట్రల్ జోన్ ఏసీపీ అంకినీడు ప్రసాద్ తన సిబ్బందితో రావడం చూసిన ఎమ్మెల్యే తాను వణుకూరు వెళ్లి విలేకరులతో మాట్లాడుతానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఎమ్మెల్యే గెస్టుహౌస్ వద్దే ఉన్న సబ్ కలెక్టర్ పోలీసులకు అరెస్టు ఆదేశాలు జారీ చేసి వెళ్లిపోయారు. భూమి ఆక్రమణ, తవ్వకాలకు సంబంధించి తహసీల్దార్ మురళీకృష్ణ శుక్రవారం ద్రోణవల్లి కోటేశ్వరరావు, పుట్టగుంట రవిపై ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు వారిపై కేసునమోదు చేయకుండా తాత్సారం చేయటంతోనే పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని స్థానికులు చెప్పారు. శనివారం నాటి ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసులు నమోదు చేయకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment