విద్యార్థి దశనుంచే కమ్యూనిస్టు భావాలు పునికిపుచ్చుకొని, ప్రజల కష్టసుఖాలు ఎరిగిన నేత బద్దూ చౌహాన్. దేవరకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మూడు సార్లు విజయం సాధించారు.
నల్లగొండ అర్బన్/దేవరకొండ, న్యూస్‌లైన్ : విద్యార్థి దశనుంచే కమ్యూనిస్టు భావాలు పునికిపుచ్చుకొని, ప్రజల కష్టసుఖాలు ఎరిగిన నేత బద్దూ చౌహాన్. దేవరకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మూడు సార్లు విజయం సాధించారు. స్వార్థ రాజకీయాలకు దూరంగా, ప్రజాసేవే పరమార్థంగా భావించి పనిచేశారు. జీవిత చరమాంకంలో పెరాలసిస్‌తో బాధపడుతూ ఆదివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన మృతితో దేవరకొండలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
1978లో దేవరకొండ ఎమ్మెల్యే స్థానాన్ని ఎస్టీలకు రిజర్వు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ జిల్లాకు చెందిన డి. రవీంద్రనాయక్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. మంత్రి అయ్యారు. 1983లో కూడ ఆయనే గెలుపొందారు. అనంతరం రాష్ట్రంలో నాదెండ్ల భాస్కర్‌రావు ప్రభుత్వం సంక్షోభంలో పడి 1985లో మధ్యంతర ఎన్నికలొచ్చాయి. ఆ సమయంలో టీడీపీతో కమ్యూనిస్టులు ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నారు. వరుసగా రెండు సార్లు కాంగ్రెస్ అభ్యర్ధి రవీంద్రనాయక్ చేతిలో ఓడిన సీపీఐ వారు ఈ సారి కొత్త అభ్యర్ధి కోసం అన్వేషించడం మొదలు పెట్టారు.
వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బద్దూచౌహాన్‌ను ఎంపిక చేశారు. ఏఐఎస్‌ఎఫ్‌లో క్రీయాశీలక నేతగా పనిచేసిన అనుభవమే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ తెచ్చిపెట్టింది. 1985లో మిత్రపక్షాల మద్దతుతో పీసీసీ ప్రధాన కార్యదర్శి బి. విజయలక్ష్మిని బద్దూ చౌహాన్ ఓడించి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో డి. రాగ్యానాయక్‌పై, 1994లోనూ విజయం సాధించారు. వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధిం చిన ఎమ్మెల్యేగా బద్దూ చౌహాన్ రికార్డు సృష్టించారు. 1999లో సీపీఐ, టీడీపీ విడివిడిగా పోటీచేయడంతో రాగ్యానాయక్ చేతిలో ఓడిపోయారు.
పార్టీలో కీలక పదవులు
బద్దూ చౌహాన్ సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, కార్మిక సంఘం నాయకుడిగా, ఆ పార్టీ విభాగం గిరిజన నాయకుడిగా పలు హోదాల్లో పనిచేశారు.
నిస్వార్థ సేవ
మూడు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా పనిచేసినా ఆయన ఎప్పుడూ ఆడంబరాలకు పోలేదు. ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేశారు. కమ్యూనిస్టు భావాలు కలిగిన బద్దూ చౌహాన్ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన అంజలిని ఆదర్శ వివాహం చేసుకున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నా భార్యను టీచర్‌గానే కొనసాగించారు.
చరమాంకంలో కష్టాలు...
పేదరికంలో పుట్టిన బద్దూ చౌహాన్ ఎమ్మెల్యేగా మూడు పర్యాయాలు ఎన్నికైనా ఎలాంటి ఆస్తులూ కూడబెట్టుకోలేదు. ఎమ్మెల్యేగా నాలుగో పర్యాయం ఓటమి పాలైన తర్వాత హైదరాబాద్‌లో ఉన్న తన కొడుకు గౌతమ్, కూతురు ఝాన్సీల వద్ద ఉన్నారు. 7సంవత్సరాల క్రితం పక్షవాతం రావడంతో అనారోగ్యానికి గురయ్యారు.
బద్దూ చౌహన్ మృతికి సంతాపం
బద్దూ చౌహన్ మృతికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, మాజీ ఎమ్మెల్యే, సీపీఐ నాయకులు రమావత్ రవీంద్రకుమార్‌లు సంతాపం వ్యక్తం చేశారు. దేవరకొండకు చెందిన పలువురు నాయకులు కూడా ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి బద్దూ చౌహాన్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.