సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఆదర్శనగర్‌లో ఉన్న న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తనకు కేటాయించిన క్వార్టర్ నంబర్ 157ను పరిశుభ్రంగా ఉంచుకుందామని మరమ్మతులు చేయించుకున్నా రాజకీయం చేస్తారా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కేటాయించిన క్వార్టర్లకు పునరుద్ధరణ పనులు చేయించుకోవడమనేది అందరూ చేసేదేనని తాను మాత్రమే ఆ పనులు చేయడంలేదని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఎరబెల్లి దయాకర్‌రావు, టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మరో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్వార్టర్లు తనకు కేటాయించిన వరుసలోనే ఉన్నాయని వారంతా వాటిని తమ అభీష్టం మేరకు పునరుద్ధరణ పనులు చేసుకున్నారని, ఢిల్లీలో కూడా టీడీపీ ఎంపీ సీఎం రమేష్, మంత్రి సుజనాచౌదరికి కేటాయించిన క్వార్టర్లను స్టార్ హోటళ్ల మాదిరిగా పునర్నిర్మించుకున్నారని ఈ సందర్భంగా చెవిరెడ్డి ఉదహరించారు.
అయితే, తన విషయంలోనే వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తన క్వార్టర్ మరమ్మతులపై వ్యతిరేక కథనం రాసిన ఆంగ్ల పత్రిక ఎడిటర్, రిపోర్టర్‌పై తాను న్యాయపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. నంబర్ 157 క్వార్టర్‌లో అడుగు పెట్టేనాటికి పైకప్పు పెంకులు ఊడిపోయి, వర్షపు నీళ్లు కారుతూ అధ్వానంగా ఉండడంతో.. పనులు చేసుకుంటానని ప్రభుత్వానికి లేఖ రాస్తే అనుమతించారన్నారు.
దీనికి సంబంధించిన ప్రభుత్వ ఆదేశాల కాపీని చెవిరెడ్డి చూపించారు. సీఎం చంద్రబాబు రూ.50 కోట్ల ప్రజాధనం వెచ్చించి తన కార్యాలయాన్ని పునర్నిర్మించుకుంటే తప్పులేదు కానీ తన విషయంలోనే ఎందుకు ఇలా రాశారని ఆయన ప్రశ్నించారు.
ఇదికూడా రాజకీయమేనా!
Published Tue, Feb 3 2015 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 8:41 PM
Advertisement
Advertisement