
లబ్ధిదారులకు డబ్బు తిరిగి ఇస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
వైఎస్‌ఆర్ జిల్లా,ప్రొద్దుటూరు : చంద్రబాబు నాయుడు హయాంలోని ఆదరణ పథకం కమీషన్ల మయంగా ఉండేదని ఎమ్మెల్యే రాచమల్లు శిపవ్రసాదరెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని 687 మంది ఆదరణ–2 పథకం కింద పనిముట్ల కోసం 10 శాతం చొప్పున డిపాజిట్ చెల్లించగా ఇంత వరకు పనిముట్లు రాలేదు. దీంతో లబ్ధిదారులకు రూ.6,68,549ను గురువారం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, అధికారులు పంపిణీ చేశారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏడాదిన్నర కిందట ఎంతో మంది పేదలు ఆదరణ పథకానికి కుట్టు మిషన్లు, వాషింగ్ మిషన్లు, ఇస్త్రీ పెట్టెలు కావాలని దరఖాస్తు చేశారన్నారు. వాస్తవానికి మార్కెట్‌లో కుట్టుమిషన్ విలువ రూ.5వేలు ఉండగా టీడీపీ ప్రభుత్వం మాత్రం రూ.8,400తో లబ్ధిదారులకు ఇవ్వాలని చూసిందన్నారు. ఆదరణ–1 పథకం ద్వారా ముందుగా కొంత మందికి పరికారాలు మంజూరు చేయగా ఆదరణ–2 పథకానికి మళ్లీ దరఖాస్తు చేశారన్నారు.
10 శాతం చెల్లిస్తే సామగ్రి వస్తుందని లబ్ధిదారులు భావించారన్నారు. దీని ద్వారా ప్రజా ధనం దుర్వినియోగమైందని తెలిపా రు. జిగ్‌జాగ్ మిషన్ రూ.9,600, జాకార్డు మిషన్‌కు రూ.18,500కు 10 శాతం చొప్పున డబ్బు చెల్లించారన్నారు. రూ.6,500తో జాకార్డు తెచ్చి తాను పంపిణీ చేసిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు.లబ్ధిదారులకు డబ్బు చెల్లించడంలో జాప్యం అవుతుండటంతో ఈ విషయాన్ని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లానని, అధికారులకు ఫోన్ చేశానని తెలిపారు. అర్హులందరికీ ఇంటి స్థలంతోపాటు అమ్మ ఒడి పథకం తప్పక మంజూరవుతుందని, ఇందులో ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దన్నారు. వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ ఎన్.రాధ మాట్లాడుతూ ఆదరణ లబ్ధిదారులు చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వడానికి జాప్యం జరిగిన మాట వాస్తవమేనన్నారు. సమావేశంలో మెప్మా టీఈ కెజియా జాస్లిన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment