వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ...
వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి
కర్లపాలెం : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. బాపట్ల నుంచి విజయవాడ వెళ్తూ కర్లపాలెంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా నుంచి తనను పోటీ చేయాల్సిందిగా జగన్ ఆదేశించారని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా పని చేసి జిల్లా అభివృద్ధికి కృషి చేశానని ఆయన తెలిపారు.
అలాగే, జిల్లాలోని ప్రజా ప్రతినిధులతో తనకున్న పరిచయాలు, పార్టీ అభ్యర్థిత్వం తన గెలుపునకు దోహదపడతాయని చెప్పారు. టీడీపీ అధికారం చేపట్టి ఏడాది కాలమైనా సాధించింది ఏమీ లేదని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యాన ప్రజల పక్షాన జరిగే పోరాటంలో కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆట్ల బ్ర హ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధనరెడ్డి, కర్లపాలెం జెడ్పీటీసీ గుంపుల కన్నయ్య, మండల ఉపాధ్యక్షుడు పందరబోయిన సుబ్బారావు, నాయకులు మోదుగుల బసవ పున్నారెడ్డి, మందపాటి పరమానందకుమార్, బన్నారావూరి శ్రీనివాసరావు, కూచిపూడి శ్యామ్యూల్ జాన్, తాజుద్దీన్, గోవతోటి సుబ్బారావు, డి.మాధవరెడ్డి, కత్తిదానియేలు, ఎం.కృష్ణమూర్తిరాజు, అక్కల శ్రీనివాసరెడ్డి, నందిపాటి సుబ్బారావు, ఖాజామొహిద్దీన్, దొంతిరెడ్డి నందారెడ్డి, ఏడుకొండలు తదితరులు ఉన్నారు.