సాక్షి, విజయవాడ : జిల్లాలో సమైక్య ఉద్యమం సమరోత్సాహంతో ఉరకలెత్తుతోంది. వేలమంది విద్యార్థులు, ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారు. ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనంచేశారు. వైఎస్ విజయమ్మ ఆమరణ దీక్షకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు మండలాలలో రిలేదీక్షలు చేపడుతున్నారు. విజయవాడలోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద రెండోరోజు నిర్వహించిన నిరశన దీక్షలను జిల్లా కన్వీనర్ ఉదయభాను ప్రారంభించారు.
తిరువూరులో ఉద్యోగుల జేఏసీ చేపట్టిన రిలేనిరాహారదీక్షలకు ఎమ్మెల్యే పద్మజ్యోతి మద్దతు ప్రకటించి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. గుడివాడలో సంపూర్ణబంద్ నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూచౌక్ సెంటర్లో రిలేదీక్షలు చేశారు. కైకలూరు పార్టీ కార్యాలయం వద్ద సాగుతున్న రిలే దీక్షలు ఐదో రోజుకు చేరాయి. కలిదిండి మండలం గుర్వాయిపాలెంలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే దీక్షలు జరిగాయి. మూలలంక గ్రామస్తులు రోడ్డుపై వంటావార్పు చేశారు. జగ్గయ్యపేట పట్టణంలో సమైక్యాంధ్ర కోరుతూ రాజకీయేతర జేఏసీ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన రిలేదీక్షలలో ఎస్‌జీఎస్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. మున్సిపల్ సెంటర్‌లో విద్యార్థులు మానవహారం నిర్వహించారు.
జిల్లా సరిహద్దు గరికపాడు వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై కొద్దిసేపు ఆందోళన జరిపారు. మైలవరంలో ఎన్జీఓల సంఘం అధ్వర్యంలో రిలేదీక్షలు ప్రారంభించారు. మైలవరం రిక్షా వర్కర్స్ యూనియన్ సభ్యులు భారీగా ర్యాలీ నిర్వహించి, కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ అధ్వర్యంలో మైలవరంలో నాలుగో రోజు కూడా దీక్షలు కొనసాగాయి. తెలుగు తల్లి సెంటర్‌లో కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లో ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి అంత్యక్రియలు జరిపారు. నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
విజయమ్మ దీక్షకు మద్దతుగా నందిగామలో భారీ ర్యాలీ చేశారు. చల్లపల్లిలో పలు విద్యాసంస్ధల విద్యార్థులు భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. గిలక్కాయలు ఊదుతూ నిరసన వ్యక్తంచేశారు. జి. కొండూరులోని గెయిల్ కార్యాలయం వద్ద గ్రామస్తులు ఆందోళన చేశారు. చల్లపల్లిలో ఎస్సార్‌వైఎస్పీ జూనియర్ కళాశాల విద్యార్థులు సైకిల్‌ర్యాలీ చేశారు. వార్డెన్లు సమ్మెలో పాల్గొనడంతో చల్లపల్లి మండలంలో ఆరు వసతి గృహాలు మూతపడ్డాయి. వైఎస్సార్‌సీపీ అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి ర మేష్‌బాబు ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో విజయమ్మ దీక్షాస్థలికి తరలి వెళ్లారు.
గన్నవరంలో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు పదో రోజుకు, హనుమాన్‌జంక్షన్‌లో నాన్ పోలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు 21వ రోజుకు చేరుకున్నాయి. ఉయ్యూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యార్థులు భారీ ప్రదర్శన చేశారు. ఏపీ ఎన్‌జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. వ్యాపారులంతా స్వచ్ఛందంగా బంద్ పాటించారు. కంకిపాడులో బైక్ ర్యాలీ జరిగింది. పెనమలూరు మండలంలో సిద్ధార్థ కళాశాల వద్ద దీక్షలు కొనసాగాయి. విజయమ్మ దీక్షకు మద్దతుగా గంగూరులో రిలే నిరశన మూడో రోజూ కొనసాగింది. ఆటో వర్కర్లు ర్యాలీ నిర్వహించారు.
విజయవాడలో...
ఎన్జీవోల ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు బెంజిసర్కిల్‌లో మానవహారం నిర్వహించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వేలాదిమంది విద్యార్థులు ఎన్‌హెచ్-5 పైప్రదర్శన చేశారు. విజయవాడ విద్యాసంస్థల ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఎంజీరోడ్డులోని సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏటీఏ ఆధ్వర్యంలో ఆటోనగర్‌లో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు సామినేని ఉదయభాను, ఉప్పులేటి కల్పన సంఘీభావం ప్రకటించారు. ఆటోనగర్ గేట్ వద్ద నిర్వహించిన ఆందోళనలో పాల్గొని ఉదయభాను డప్పు కొట్టారు. సెప్టెంబర్ రెండు తర్వాత నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్లు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. గుణదల కమర్షియల్ టాక్స్ కార్యాలయం వద్ద ఆ శాఖ ఉద్యోగులు రాస్తారోకో చేశారు. వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ నేతృత్వంలో వైఎస్ విజయమ్మ ఆమరణదీక్షకు మద్దతుగా స్థానిక మీసాల రాజేశ్వరరావు వంతెన వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
సమరోత్సాహం
Published Sat, Aug 24 2013 12:31 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
Advertisement
Advertisement