మరింత పెరిగిన కిక్కు
Published Sun, Mar 26 2017 8:31 PM | Last Updated on Fri, Aug 17 2018 7:44 PM
నేను అధికారంలోకి వస్తే మద్యం అమ్మకాలను విడతల వారీగా తగ్గిస్తా. అక్క చెల్లెమ్మల కన్నీళ్లు తుడుస్తా. బెల్టు షాపు లేకుండా చేస్తా’’ అంటూ 2014 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సభల్లో హమీ ఇచ్చారు. ఇందుకు ఆయా సభలకు హాజరైన ప్రజలే ప్రత్యక్ష సాక్షులుగా నిలిచారు. ఎన్నికలు ముగిశాయి, బాబు ముఖ్య
మంత్రి అయ్యారు. ఇక తమ గ్రామంలో ఉన్న బెల్టు షాపు తీసేస్తారనుకున్న మహిళలకు కొద్ది రోజులకే బాబు తత్వం బోధపడింది. ఉన్నవి తొలగించడం దేవుడెరుగు కొత్తగా మరిన్ని బెల్టు షాపులు పుట్టుకొచ్చాయి.
► జిల్లాలో 545 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్
► ఇప్పటి వరకు ఉన్నవి 499
► ఈ ఏడాది నుంచి మరో 46 దుకాణాలు అదనం
► నీటి మూటలవుతున్న బాబు హామీలు
► ఆదాయమే అజెండాగా మద్యం దుకాణాల పెంపు
► మరోవైపు మద్యం వ్యాపారులకు బాబు టోపీ
తూర్పుగోదావరి: మద్యం అమ్మకాలను క్రమంగా తగ్గిస్తామన్న హామీ మేరకు దుకాణాల సంఖ్య కుదిస్తారని అనుకున్న మహిళల ఆశలు ఆడియాశలయ్యాయి. రెండేళ్ల కాలపరిమితితో జిల్లాలో 2015 జూలై నుంచి 2017 జూన్ వరకు 499 మద్యం దుకాణాలకు జిల్లాలో అనుమతులు ఇచ్చారు. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం అబ్కారీ సూపరింటెండెంట్ల పరిధిలో ఇవి ఉన్నాయి.
అయితే జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణాలను వాటికి 500 మీటర్ల దూరానికి తరలించాలని, లేనిపక్షంలో ఆయా దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట దాదాపు 75 శాతం మద్యం దుకాణాలున్నాయి. జిల్లాలో ఉన్న 499 దుకాణాల్లో 376 దుకాణాలు సుప్రీం కోర్టు తీర్పు పరిధిలోకి వస్తున్నాయి. లైసెన్సు కాలపరిమితి మరో మూడు నెలలున్నా కూడా సుప్రీం తీర్పు నేపథ్యంలో ముందుగానే ఆయా దుకాణాలకు మరో రెండేళ్ల కాలపరివిుతికి లైసెన్సులు జారీ చేసేందుకు ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
545 దుకాణాలకు నోటిఫికేషన్ జారీ...
ఇప్పటి వరకు జిల్లాలో 499 మద్యం దుకాణాలున్నాయి. వీటి కాలపరిమితి మరో మూడు నెలలుంది. అయితే సుప్రీం తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ముందుగానే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి జిల్లాలో 545 దుకాణాలకు లైసెన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గతంతో పోల్చుకుంటే అదనంగా 46 దుకాణాలు జిల్లాలో కొత్తగా ఏర్పాటు కానున్నాయి. ఎన్నికల వేళ మద్యం అమ్మకాలను క్రమంగా తగ్గిస్తామన్న చంద్రబాబు ఇప్పడు అందుకు విరుద్ధంగా చేస్తుండడంపై మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మద్యం అమ్మకాలను తగ్గించకపోగా ఆదాయమే ప్రధాన ఎజెండాగా జిల్లాలో ఉన్న దుకాణాలకు అదనంగా మరో 10 శాతం పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా లైసెన్సులు జారీ చేసే దుకాణాలు 2019 జూన్ వరకు కొనసాగనున్నాయి.
వ్యాపారులకూ చంద్రబాబు దెబ్బ..
సుప్రీం కోర్టు తీర్పునకు ప్రభావితమయ్యే దుకాణాలు జిల్లాలో 376 ఉన్నాయి. ఇందులో 299 దుకాణాలను తరలిచుకునేందుకు మద్యం వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు సుప్రీం తీర్పును అమలు చేస్తున్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారులు రెండూ కూడా తీర్పులో ఉండడంతో ఎక్కువ సంఖ్యలో దుకాణాలు తరలించడం లేదా తొలగించాల్సి వస్తోంది. జిల్లాలో జాతీయ రహదారుల వెంట 499లో కేవలం 39 దుకాణాలు మాత్రమే ఉన్నాయి.
మిగిలిన 335 దుకాణాలు రాష్ట్ర రహదారుల వెంట ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉండడంతో రాష్ట్ర రహదారులను కేసీఆర్ సర్కారు రోడ్లు భవనాల రహదారులుగా మార్పు చేసింది. దాంతో అక్కడ ఉన్న వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. దరఖాస్తులు, లైసెన్సు ఫీజులు రూపంలో లక్షల రూపాయలు ప్రభుత్వానికి కట్టిన వ్యాపారులు మరో మూడు నెలలు ముందుగానే దుకాణాలు సర్దేసేయాలనడంతో భారీగా నష్టపోతున్నారు. అధికారికంగా చెల్లించే ఫీజులుగాక అందుకు అదనంగా కొన్ని చోట్ల యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు మామూళ్లు కూడా సమర్పించుకున్నారు. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలు వ్యాపార సీజన్ కావడం, సుప్రీం తీర్పు అమలు చేస్తుండడంతో మద్యం వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయంపై సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటీషన్ కూడా ఉపసంహరించుకుంది. ప్రస్తుతం వ్యాపారులు వేసిన పిటీషన్ తీర్పు ఈ నెల 27కు వాయిదా పడింది. సుప్రీం తీర్పు అమలుకు మరో ఐదు రోజులు మాత్రమే ఉండడంతో తీర్పు ఎలా వస్తుందోనన్న ఉత్కంఠలో మద్యం వ్యాపారులున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోలా ఇక్కడ కూడా రాష్ట్ర రహదారులను రోడ్లు భవనాల రోడ్లుగా మారిస్తే దాదాపు 90 శాతం మద్యం దుకాణాలు తొలగించాలి్సన అవసరం ఉండదు. ఫలితంగా తాము పెద్దగా నష్టపోకుండా ఉంటామని వ్యాపారులు పేర్కొంటున్నారు. 24. 27 నెలలకు లైసెన్స్ జారీ చేస్తుండడంతో ప్రభుత్వానికి ఆదాయం మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో బాబు గారి కాసుల వేటలో వ్యాపారులు ఆశలు అడియాశలే కానున్నాయి.
Advertisement
Advertisement