ఊరడింపు వరాలు | more guarantee schemes by chandrababu naidu | Sakshi
Sakshi News home page

ఊరడింపు వరాలు

Published Sat, Aug 16 2014 12:57 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

more guarantee schemes by chandrababu naidu

సాక్షి ప్రతినిధి, కర్నూలు: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సాక్షిగా కర్నూలులో రాజధాని ఏర్పాటు లేదనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పకనే చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పథకాలను వల్లె వేస్తూ.. కొత్తదనం లేని హామీలతో సరిపెట్టారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలి వేడుకకు కర్నూలు నగరం వేదిక కాగా.. శుక్రవారం జెండా పండుగ కనుల పండువగా సాగింది.

త్రివర్ణ పతాకావిష్కరణ అనంతరం సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సుదీర్ఘ ప్రసంగంలో కర్నూలు జిల్లాపై వరాల వర్షం కురిపించారు. ఆచరణ సాధ్యం కాని హామీలపై టీడీపీ శ్రేణులే విస్తుపోయి చూడగా.. ప్రజల నుంచి కూడా పెద్దగా స్పందన లేకపోయింది. అధిక శాతం హామీలు ఇటీవల ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అందజేసిన నివేదికలోనివే కావడం గమనార్హం.

 చంద్రబాబు వల్లె వేసిన వైఎస్ మానస పుత్రికలు
  సాగునీటి సమస్య పరిష్కారానికి గుండ్రేవుల రిజర్వాయర్, గోరుకల్లు రిజర్వాయర్‌ల నిర్మాణం.
  హంద్రీనీవా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజలకు నీరివ్వడం.
  టెక్స్‌టైల్, అపెరల్ పార్కు ఏర్పాటు.
  ఓర్వకల్లు సమీపంలో విమానాశ్రయ నిర్మాణం.
 
ఈ హామీలు ఎప్పటికి అమలయ్యేనో...
  కర్నూలు ప్రభుత్వాసుపత్రి స్థాయి పెంచి నిమ్స్ తరహాలో రాయలసీమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెంటర్‌గా తీర్చిదిద్దడం.

  నంద్యాలలో విత్తనోత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి వ్యవసాయ విశ్వ విద్యాలయంగా తీర్చిదిద్దడం. దేశంలోనే సీడ్ క్యాపిటల్‌గా అభివృద్ధి చేయడం.

  జిల్లాలో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు.

  ఖనిజ సంపద విస్తారంగా ఉన్న డోన్‌లో ధన్‌బాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ తరహా ప్రతిష్టాత్మక సంస్థను స్థాపించడం.

  సోలార్, విండ్ ఎనర్జీ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు కర్నూలు జిల్లా అనుకూలంగా ఉండటంతో సాంప్రదాయేత ఇంధన వనరుల వినియోగానికి చర్యలు.

 
బనవాసిలో గొర్రెలు, మేకలు, ఒంగోలు గిత్తల పరిశోధన కేంద్రం ఏర్పాటు.
 
కేంద్రం ప్రకటించిన 100 స్మార్ట్‌సిటీల్లో తొలి నగరంగా కర్నూలు అభివృద్ధి.
 
ఓర్వకల్లు వద్దనున్న 30వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో పారిశ్రామిక నగరం ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలను కల్పించడం. మ్యానుఫ్యాక్చరింగ్, హార్డ్‌వేర్, ఐటీ పరిశ్రమలు ఏర్పాటుకు చర్యలు.
 
జొహరాపురం వద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణం.
 
ఆలూరు వద్ద జింకల పార్కు. శ్రీశైలం, నందికొట్కూరులో అదే తరహా పార్కులు ఏర్పాటు చేసి వన్యప్రాణులను సంరక్షించడం.
 
 శ్రీశైలం, మంత్రాలయం, యాగంటి, మహానంది తదితర పుణ్యక్షేత్రాలను అనుసంధానించి అభివృద్ధి చేయడం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement