అక్రమార్కులకు అండగా భాయ్ | More than 300 illegal multi-floors | Sakshi
Sakshi News home page

అక్రమార్కులకు అండగా భాయ్

Published Fri, Sep 26 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 PM

అక్రమార్కులకు అండగా భాయ్

అక్రమార్కులకు అండగా భాయ్

- అనుగ్రహిస్తే ఓకే.. లేకుంటే కూల్చివేతే
- నగరంలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు
- 300కు పైగా అక్రమ బహుళ అంతస్తులు
- అధికారులు గుర్తించినవి 50 మాత్రమేనట
- 30 నిర్మాణాలపై కేసులకు సిఫార్సు
- రెండు నిర్మాణాలపైనే చర్యలు
సాక్షి, నెల్లూరు :
నెల్లూరు నగర మేయర్ అజీజ్ భాయ్ అనుగ్రహం ఉంటే చాలు అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగించవచ్చు. ప్రైవేటు, ప్రభుత్వ స్థలమైనా ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తులు నిర్మించినా కార్పొరేషన్ అధికారులు కన్నెత్తి కూడా చూడరు. కాకపోతే వారడిగినంత ముట్ట చెప్పాలి. మేయర్ ఆగ్రహించాడా చిన్న ప్రహరీ అయినా, బహుళ అంతస్తు అయినా నేల మట్టం కావాల్సిందే.    
 
5 వేలకు పైగా అక్రమ నిర్మాణాలు
నగరంలో ఆక్రమణలకు, అక్రమ నిర్మాణాలకు కొదవలేదు. నగరంలో 5 వేలకు పైగా అక్రమ కట్టడాలు ఉన్నాయని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఇటీవల కుప్పలు తెప్పలుగా వెలుస్తున్న బహుళ అంతస్తుల  నిర్మాణాల్లోనూ పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 500 వరకు బహుళ అంతస్తులు ఉండగా 300కు పైగా నిబంధనలు అతిక్రమించి నిర్మించినవే ఉన్నాయని కార్పొరేషన్ అధికారులే చెబుతున్నారు. ఆక్రమణల్లో ఇరుగు పొరుగు పేదల స్థలాలతో పాటు నగరపాలక సంస్థ స్థలాలను సైతం స్వాహా చేసిన ఉదంతాలు కోకొల్లలు. ఇంత జరుగుతుంటే ఘనత వహించిన కార్పొరేషన్ అధికారులు అక్రమ కట్టడాలుగా గుర్తించినవి 50 మాత్రమేనట.

వాటిలో క్రిమినల్ కేసుల కోసం ప్రతిపాదించినవి 30 అక్రమ కట్టడాలకేనట. పోనీ వాటి మీద అయినా చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు. ముఖ్యంగా ఎస్పీ ఆఫీసు, మినీబైపాస్ రోడు,్డ చిన్నబజార్, ట్రంకురోడు, పొదలకూరు రోడ్డ్డు తదితర ప్రాంతాల్లో అధికారులు గుర్తించిన అక్రమ భవనాలే 50కి పైగా ఉన్నాయి. ఇక ఇరిగేషన్ కాలువల ఆక్రమణలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. కానీ మేయర్ అజీజ్ వాటిని పట్టించుకోకుండా రవీంద్రభారతి పాఠశాల, ములుమూడి బస్టాండ్ ప్రాంతంలో ఒక ఇంటినే టార్గెట్ చేయడంపై కార్పొరేషన్ అధికారులు విమర్శిస్తున్నారు.
 
మేయర్ పక్షపాతం
ఇదే సమయంలో అజీజ్ మేయరయ్యారు. ఇక నగరంలో కార్పొరేషన్ స్థలాల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్టపడుతుందని అందరూ భావించారు. అందుకు తగినట్లుగానే అజీజ్ తొలుత నగరంలోని ఫతేఖాన్‌పేట రమేష్‌రెడ్డినగర్‌లో రవీంద్రభారతి పాఠశాల ప్రహరీని, అక్కడున్న రేకుల షెడ్‌ను దగ్గరుండి మరీ కూల్చి వేయించారు. నగరంలో ఇక ఎవరు ఆక్రమణలకు పాల్పడినా సహించేది లేదని మేయర్ విలేకరుల సమావేశంలో ఆవేశ పూరితంగా చెప్పారు. రెండు నెలల తరువాత తాజాగా ములుమూడి బస్టాండ్ ప్రాంతంలో ఓ వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణం సాగించాడని మేయర్ ఆగ్రహం వ్యక్తం చేయడం, హుటాహుటిన అధికారులు వెళ్లి ఆ భవనాన్ని కూల్చివేయడం తెలిసిందే. మేయర్, కార్పొరేషన్ అధికారులు ఇలా ఎందుకు చేస్తున్నారో నగర వాసులకు తెలియంది కాదు. అనుచరుల సూచనల మేరకు అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఒకరిద్దరినో, ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలకు చెందిన ఇంటినో కూల్చి కక్షపూరిత చర్యలకు దిగడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.    
 
అధికారుల అవినీతికి అడ్డు ఏదీ
మరో వైపు కార్పొరేషన్ అధికారుల అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోతోందన్న ఆరోపణలు వెల్లువెల్లువెత్తుతున్నాయి. ప్రతి నిర్మాణంలోనూ ముఖ్యంగా బహుళ అంతస్తుల నిర్మాణ సమయంలో నిర్మాణంలో 10 శాతం కట్టడాన్ని ఉదాహరణకు 10 ప్లాట్ల బిల్డింగ్ నిర్మిస్తుంటే ఒక ప్లాట్‌ను కార్పొరేషన్‌కు మార్ట్‌గేజ్ చేయాలి. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగితే వారిపై చర్యలు తీసుకునేందుకే ఈ పద్ధతి కార్పొరేషన్ అవలంబిస్తుంది. నిబంధనలు పాటించేందుకు నిర్మాణదారు ససేమిరా అంటే 10 శాతం కట్టడాన్ని కార్పొరేషన్ స్వాధీన పరచుకోవచ్చు. అయితే అధికారులు అందిన కాడికి డబ్బులు దండుకుని ఈ నిబంధనలకు పాతరేస్తున్నారు. అధికారులు మాత్రం ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ సొంత ఆదాయం లక్షల్లో పెంచుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement