చేగుంట, న్యూస్‌లైన్: రాఖీ పౌర్ణమి..ఊళ్లో ఉన్న మహిళలంతా తమ సోదరులకు రాఖీలుకట్టి ఆనందపడుతున్నారు. రేణుక కూడా తన సోదరునికి రాఖీ కట్టాలనుకుంది. రాఖీ కూడా తెచ్చి ఉంచుకుంది. అయితే బట్టలుతికేందుకు వెళ్తున్న తల్లికి సాయం చేసేందుకు చెరువుకు వెళ్లింది....వచ్చాక రాఖీ కడతా తమ్ముడూ అంటూ ఇంటి నుంచి వెళ్లి యువతి ప్రమాదవశాత్తూ తల్లితోపాటు నీటమునిగి మృత్యువాత పడింది. రక్షాబంధన్ పర్వదినాన జరిగిన ఈ విషాదకర సంఘటన మండలంలోని రుక్మాపూర్‌లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...రుక్మాపూర్‌లో ఉంటున్న ముత్యాలు, ఎల్లవ్వలకు ముగ్గురు సంతానం. ఇందులో ఇద్దరు ఆడ పిల్లలు కాగా, ఓ కుమారుడు. పెద్దకూతురికి పెళ్లిచేసి పంపిన ఈ దంపతులు త్వరలోనే చిన్న కూతురికి కూడా వివాహం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఈ క్రమంలో బుధవారం ముత్యాలు పనిమీద బయటకు వెళ్లాడు. భార్య ఎల్లవ్వ(45), చిన్నకూతురు రేణుక(18), కుమారుడు మల్లేశం ఉన్నారు. గురువారం నుంచీ ఊళ్లో ముత్యాలమ్మ జాతర ఉండడం...ఇంటికి చుట్టాలు వస్తుండడంతో బట్టలు, బెడ్‌షీట్లు ఉతికేందుకు ఎల్లవ్వ స్థానిక గుండ్లచెరువుకు బయలుదేరింది. గమనించిన కూతురు రేణుక కూడా తానూ వస్తానంటూ తల్లితోపాటు వెళ్లింది. వెళ్తూ...వెళ్తూ...తననే చూస్తున్న తమ్ముడు మల్లేష్‌తో బట్టలుతికి వచ్చాక రాఖీ కడతాలే అని చెప్పింది. చెరువులో బట్టలుతుకుతూ వాటిని పిండే క్రమంలో ఎల్లవ్వ ప్రమాదవశాత్తూ నీట మునిగిపోయింది. ఇది గమనించిన కూతురు రేణుక తల్లిని కాపాడే ప్రయత్నంలో ఆమె కూడా నీట మునిగిపోయింది.
గమనించిన మహిళలు కేకలు వేస్తూ గ్రామస్థులకు విషయం తెలిపారు. హుటాహుటిన చెరువు దగ్గరకు వచ్చిన గ్రామస్థులు చెరువులో గాలించగా, ఎల్లవ్వ, రేణుకల మృతదేహాలు లభించాయి. విషయాన్ని పోలీసులకు తెలపడంతో సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు ఆరా తీశారు. ఎల్లవ్వ భర్త ముత్యాలు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వినాయక్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా రాఖీ పండుగరోజే గ్రామంలో విషాదం చోటుచేసుకోవడం...సోదరి, తల్లి మృత్యువాతపడడం చూసి మల్లేశం రోదించిన తీరు అందరినీ కలచివేసింది.
తల్లీ కూతుళ్లిద్దరూ మృతి
Published Thu, Aug 22 2013 12:47 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
Advertisement