గుంటూరు జీజీహెచ్‌లోని ఎస్‌ఎన్‌సీయూ వార్డులో బాలింతలకు కేటాయించిన పడకల దుస్థితి
గుంటూరు మెడికల్: నవమాసాలు బిడ్డను కడుపులో మోసి జన్మనిచ్చే సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్య సౌకర్యాలు లేక ఎందరో తల్లులు ప్రాణాలు కోల్పోతున్నారు. కాన్పు సమయాల్లో సంభవించే మాతృమరణాలను తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏడాది జిల్లాకు కోట్లాది రూపాయలు జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా విడుదల చేస్తున్నాయి. ఆ నిధులను వినియోగించడంలో అధికారులకు చిత్తశుద్ధి కొరవడి తల్లుల మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి.
సంభవిస్తున్న మరణాలు
జిల్లా వ్యాప్తంగా 2014–15 సంవత్సరంలో 66 మంది తల్లులు ప్రసవ సమయంలో కన్నుమూశారు. 2015–16 సంవత్సరంలో 62 మంది , 2016–17 సంవత్సరంలో 57 మంది, 2017–18లో 54 మంది తల్లులు చనిపోయారు. అయితే ఈ మాతృమరణాల్లో సగానికి పైగా మరణాలు నివారించదగినవేనని సాక్షాత్తూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జరిగే తల్లుల మరణాల ఆడిట్ సమావేశంలో వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. మాతృమరణాలను నివారించేందుకు ముందస్తుగానే వైద్య సిబ్బంది వైద్యాధికారులు ప్రణాళికాబద్ధంగా రూప కల్పన చేయాల్సి ఉంది. సరిపడా రక్తపు నిల్వలు అందుబాటులో ఉండే విధంగా కాన్పు చేసే సౌకర్యాలు ఆస్పత్రుల్లో ఉండేలా చూడాలి. ఇంటి నుంచి ఆస్పత్రికి కాన్పు కోసం తరలించేందుకు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండేందుకు అన్ని ఏర్పాట్లు ముందస్తుగానే చూసుకోవాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపైనే ఉంది. ఇలా ప్రణాళిక ప్రకారం పనిచేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యాధికారులు అందుబాటులో లేకపోవడం, కిందిస్థాయి సిబ్బందికి కాన్పులపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో ప్రతి ఏడాది మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి.
జీజీహెచ్‌లోనూ ఇదే తంతు..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉన్న అరకొర సిబ్బంది వైద్యంపై పూర్తి అవగాహన లేకపోవడంతో చివరి వరకు కాన్పు కోసం గర్భిణులను ఉంచి చిట్టచివరి సమయంలో గుంటూరు జీజీహెచ్‌కు తరలిస్తున్నారు. జీజీహెచ్‌లో 24 గంటలు కాన్పుల విభాగంలో వైద్య సేవలు లభిస్తున్నప్పటికీ కొన్ని మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ప్రతినెలా మూడు మాతృమరణాలు జీజీహెచ్‌లో సైతం నమోదవుతున్నాయి. 2018 జనవరిలో ఇద్దరు, ఫిబ్రవరిలో ఇద్దరు, మార్చిలో ఆరుగురు, ఏప్రిల్‌లో ముగ్గురు తల్లులు మరణించారు. ఆరోగ్య కేంద్రాల అధికారులకు, జీజీహెచ్ అధికారులకు మధ్య సమన్వయలోపంతో ఈ మరణాలు సంభవిస్తున్నాయి.
నివారణ చర్యలు తీసుకుంటున్నాం
మాతృమరణాల నివారణ కోసం ఆరోగ్య కేంద్రాల వారీగా సమీక్షలు నిర్వహించి సూచనలు, ఆదేశాలు ఇస్తున్నాం. ప్రతి గర్భిణీని 12 వారాలలోపే గుర్తించి పేరు నమోదు చేసి, హైరిస్క్ ప్రెగ్నెన్సీ వారిని గుర్తించి కాన్పు కోసం పెద్దాస్పత్రులకు రిఫర్ చేస్తున్నాం. ప్రతినెలా 9న ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకం ద్వారా గర్భిణులకు ఉచితంగా అన్ని పరీక్షలు చేస్తున్నాం. పోషకాహారం కోసం రూ.6 వేలు అందిస్తున్నాం. ఆరోగ్య కేంద్రాల్లో ప్రసూతి కేంద్రాలు ఏర్పాటు చేసి వైద్యులు, సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాం.–డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్,జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment