
అనుమానాస్పదరీతిలో కన్నబిడ్డను కోల్పోయి రెండు దశాబ్దాలకుపైగా మానసిక క్షోభకు గురైన ఓ అమ్మ న్యాయస్థానంలో నెగ్గింది! ఆమె వేదనకు ముగింపు పలుకుతూ నౌకాదళ ఉద్యోగి అమర్ అశోక్ పల్దే మృతిపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఉమ్మడి హైకోర్టు ధర్మాసనం ఉత్వర్వులు జారీ చేసింది. అరుదైన చర్యగా భావిస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇవీ..
– సాక్షి, హైదరాబాద్
ఇది ఓ అమ్మ ఆవేదన...
ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనురాధా అశోక్ పల్దే వయసు 70కి పైనే ఉంటుంది. దేశసేవ కోసం నౌకాదళంలో చేరిన ఆమె కుమారుడు అమర్ అశోక్ పల్దే దాదాపు రెండు దశాబ్దాల క్రితం కాకినాడ వద్ద నిర్వహించిన విన్యాసాల సమయంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నేవీ అధికారులు మాత్రం ప్రమాదవశాత్తూ చనిపోయాడని తేల్చారు. దీంతో కుమారుడి మృతిపై నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తు చేయాలంటూ ఆ తల్లి వేడుకున్నారు. దీనికి స్పందించకపోవడంతో న్యాయపోరాటం ప్రారంభించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 23 ఏళ్లుగా చేసిన ఆమె పోరాటం ఎట్టకేలకు ఫలించింది. అమర్ అశోక్ పల్దే మృతిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పల్దే మృతిపై స్వతంత్ర ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరపాలని సీబీఐకి హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తులో భాగంగా స్థానిక అధికారులు సేకరించిన ఆధారాలను అవసరాన్ని బట్టి పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. నేవీ అధికారుల వద్ద ఉన్న సమాచారాన్ని కూడా తీసుకోవచ్చని తెలిపింది. సీబీఐ విచారణకు సహకరించాలని స్థానిక పోలీసులు, నేవీ అధికారులను ఆదేశించింది. ఓ తల్లి ఆవేదనకు సంబంధించిన కేసు కాబట్టి సీబీఐ తక్షణమే దర్యాప్తు ప్రారంభించి వీలైనంత త్వరగా ముగిస్తుందనే ముగిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
ఆ రోజు ఏం జరిగిందంటే..
నౌకాదళంలో సీమెన్–1గా ఎంపికైన అమర్ అశోక్ పల్దే కమాండ్ క్లియరెన్స్ డైవింగ్ టీంలో విధులు నిర్వర్తించేవారు. 1993 సెప్టెంబర్ 21న కాకినాడ వద్ద సముద్ర తీరంలో హలో జంప్ పేరుతో ఓ సన్నాహక కార్యక్రమం జరిగింది. దీని ప్రకారం డైవర్లు హెలికాఫ్టర్ నుంచి సముద్రంలోకి దూకి అక్కడి నుంచి తీరానికి ఈదుకుంటూ రావాలి. మొత్తం నలుగురు డైవర్లు సముద్రంలోకి దూకగా అమర్ మాత్రం తీరానికి చేరుకోలేదు. రెండు రోజుల తరువాత అతడి మృతదేహం సముద్ర జలాల్లో తేలుతూ కనిపించింది. అతడి మృతదేహంపై చనిపోకముందే కొన్ని గాయాలున్నట్లు కనుగొన్నారు. అయితే దీనిపై విచారణ జరిపిన బోర్డ్ ఆఫ్ ఎంక్వయిరీ ప్రమాదవశాత్తే అమర్ మృతి చెందారని పేర్కొంటూ నివేదిక ఇచ్చింది.
మొదట బాంబే హైకోర్టులో..
నేవీ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అనురాధా అశోక్ పల్దే తొలుత బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగినందున ఈ వ్యవహారంపై విచారణ జరిపే పరిధి తమకు లేదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో మృతుడి తల్లి ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి 2016 జూన్ 7న తీర్పునిస్తూ అమర్ మృతిపై బోర్డ్ ఆఫ్ ఎంక్వయిరీ చెప్పిన కారణాలు సంతృప్తికరంగా లేవన్నారు. బోర్డ్ ఆఫ్ ఎంక్వయిరీని మరోసారి నియమించాలన్న తీర్పును సవాలు చేస్తూ నేవీ అధికారులు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ నిర్వహించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సీబీఐ విచారణకు ఆదేశిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
బాధిత కుటుంబాల్లో
విశ్వాసం నెలకొల్పేందుకే...
‘అమర్ మృతిపై కాకినాడ పోలీసులు 1993లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. కాకినాడ పోర్టు పరిధిలో ఘటన జరిగింది కాబట్టి స్థానిక పోలీసులే దర్యాప్తు జరపాలని నేవీ అధికారులు చెబుతున్నారు. నౌకాదళ నిబంధన ప్రకారం పునర్ దర్యాప్తు జరిపే అవకాశం లేదని, అందువల్ల సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం చేసుకోవాలని నావికాదళ అధికారులు అప్పీల్‌లో అభ్యర్థిస్తున్నారు. మరోవైపు తన బిడ్డది అసహజ మరణమంటూ దీనిపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని మృతుడి తల్లి కోరుతున్నారు. నౌకాదళం బోర్డ్ ఆఫ్ ఎంక్వయిరీ విచారణ నివేదిక నేపథ్యంలో స్థానిక పోలీసులు ఈ కేసులో ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మా ముందున్న అన్ని ఆధారాలు, నేవీ చట్టాలను పరిశీలించాం. బాధితులు, మృతుల తల్లిదండ్రుల మనసులో విశ్వాసం నెలకొల్పేందుకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించాం. దీనివల్ల న్యాయ లక్ష్యం నెరవేరినట్లవుతుంది’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. మరోవైపు ఇదే కేసులో పరిహారం కోసం మృతుడి తల్లి కాకినాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి విజయం సాధించారు. నేవీ అధికారుల నిర్లక్ష్యం వల్లే అమర్ అశోక్ మరణం సంబంధించిందని తేల్చిన కోర్టు.. బాధిత కుటుంబానికి పరిహారంగా రూ.10 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును హైకోర్టు సైతం సమర్థించింది.
Comments
Please login to add a commentAdd a comment