![Mother Leave Birth Child In Hospital Chittoor - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/18/child.jpg.webp?itok=bwMiozEO)
ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో తెలియదు. రక్తం పంచుకుని, పేగు తెంచుకుని పుట్టిన బిడ్డపై మమకారం చంపుకుంది. పుట్టిన అరగంటకే ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోయింది. ఆ పసికందు కళ్లు తెరిచేలోపే అనాథగా మారింది. ఆకలితో ఏడుస్తూ బిక్కచూపులు చూస్తున్న నవజాత శిశువు ఆలనాపాలనా చూసేదెవరో ఆ దేవుడికే ఎరుక.
రొంపిచెర్ల: ఒక మహిళ రక్తం పంచి కన్న బిడ్డను అరగంటలోనే వదిలి వెళ్లింది. ఈ ఘటన ఆదివారం రొంపిచెర్ల మండలంలో చోటుచేసుకుంది. సంత బజారువీధికి చెందిన ఆర్‌ఎంపీ షీబా దగ్గరకు ఆదివారం ఉదయం ఒక గర్భిణి వచ్చింది. 30 నిమిషాలకే పురిటి నొప్పులు రావడంతో బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమె బిడ్డను అక్కడే వదిలిపెట్టి గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోయింది. ఆర్‌ఎంపీ షీబా సాయంత్రం వరకు వేచి చూసినా తల్లి కాని, ఆమె తరఫు వారు కానీ రాలేదు. ఆదివారం రాత్రి రొంపిచెర్ల పోలీసులకు సమాచారం అందించారు. చిన్నగొట్టిగల్లు సీడీపీఓ ప్రదీపకు ఫోన్‌లో సమాచారం ఇవ్వడంతో ఆమె వచ్చి ఆ బిడ్డను తీసుకుని తిరుపతికి తరలించారు. బిడ్డను వదిలివెళ్లిన యువతి రాజస్థాన్‌కు చెందినట్టు ఆర్‌ఎంపీ అనుమానం వ్యక్తం చేశారు. ఆమెకు(19) ఏళ్లు ఉంటాయని, ప్రేమికుడి చేతిలో మోసపోయి గర్భం దాల్చినట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment