మూడు రోజులకే అనాథగా మారిన పసిపాప | The Mother Who Left The Baby In The Hospital | Sakshi
Sakshi News home page

మూడు రోజులకే అనాథగా మారిన పసిపాప

Jul 31 2019 8:48 AM | Updated on Jul 31 2019 8:48 AM

The Mother Who Left The Baby In The Hospital - Sakshi

ఆస్పత్రిలో పసిపాప  

తల్లి పొత్తిళ్లలో.. వెచ్చని కౌగిలితో.. ముర్రు పాలు తాగుతూ.. అప్పుడే తెరిచిన కళ్లతో తన అమ్మ లోగిళ్లలోని లోకాన్ని వీక్షిస్తూ.. తల్లి జో కొడుతుంటే హాయిగా నిద్రించాల్సి ఆడ శిశువు భూమి పైకి వచ్చి మూడు రోజులకే అనాథగా మారింది. తన ఆకలి తీర్చే దిక్కు లేక.. అమ్మ కౌగిలికి దూరమై.. క్యారు మంటోంది. నిబంధనల ఆటంకంతో వైద్యానికి దూరమై.. ఎవరి అక్కున చేరక.. ఆస్పత్రి గదిలోని కాంతుల వెలుగులో తల్లడిల్లుతున్న ఓ చిన్నారి దీనగాథ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. 

సాక్షి, కనిగిరి: కనిగిరి పట్టణంలోని గార్లపేట రోడ్లులో గల ఓ ప్రవేటు ఆస్పత్రిలో ఓ అవివాహిత మూడు రోజుల కిందట ఓ శిశువుకు  జన్మనిచ్చింది.  తెలిసి చేసిన ‘పాప’మా.. లేక తెలియక చేసిన ‘పాప’మా.. లేక ఆడపిల్ల కావడంతో వదలించుకునేందుకు చేసిన మహా పాపమా తెలియదు కాని.. ఆ బిడ్డ తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆ తల్లికి దూరమైంది. ఆస్పత్రిలోని ఓ ఆయా ఆ బిడ్డను స్థానిక ఓ ప్రవేటు చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించింది. తల్లి దండ్రులు ఎవరు లేరని వదిలేసి వెళ్లారని వైద్యం చేయాలని వైద్యునికి తెలిపింది. ఇంతలో విషయం తెలుసుకున్న  సంతానం లేని బాషా దంపతులు ఆ పసి పాపను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. చిన్న పిల్లల వైద్యుడు శిశువును పరీక్షించి.. పాపలో ప్రాణం ఉంది కాని  పూర్తి అవయవాలు రూపుదిద్దుకోలేదని, ఒంగోలులోని పెద్ద ఆస్పత్రికి  తీసుకెళ్లాలని సూచించారు.

ఆస్పత్రి సిబ్బంది సహకారంతో దత్తత తీసుకోవాలనుకున్న దంపతులు ఆ శిశువును ఒంగోలుకు తీసుకెళ్లారు. అయితే అక్కడ ప్రవేటు ఆస్పత్రుల్లో శిశువును చూపించారు. శిశువును పరీక్షించిన వైద్యులు రూ.5లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారన్నారు. ఆరోగ్య శ్రీ లో చికిత్స చేయాలంటే  తల్లి దండ్రుల పేర్లు నమోదుతో పాటు, పలు  నిబంధనలు వర్తిస్తాయని చెప్పినట్లు  బాషా దంపతులు తెలిపారు. దీంతో మధ్య తరగతి కుటుంబానికి చెందిన బాషా దంపతులు అంత ఖర్చు పెట్టలేమని ఆదివారం రాత్రి తిరిగి ఒంగోలు నుంచి కనిగిరికి తీసుకోచ్చారు. వారికి శిశువును అప్పగించిన చిన్నపిల్లల ప్రవేటు వైద్యశాలలోనే చేర్పించారు. బరువు కూడా తక్కువగా ఉన్న ఆ శిశువు ప్రస్తుతం వెంటిలేటర్‌పై ప్రాణంతో ఉందని డాక్టర్‌ సుబ్బారెడ్డి తెలిపారు. 

నిజంగా  పురుడు పోశారా.. అబార్షన్‌ చేశారా? 
అసలు శిశువు జనం అక్రమమా.. సక్రమమా అనేది అటుంచితే.. పట్టణంలోని గార్లపేట రోడ్డులో గల ఓ ప్రవేటు వైద్యశాలలో నుంచి బయటకు వచ్చింది. అయితే అక్కడ ఆ శిశువు తల్లికి ఆబార్షన్‌ చేసి బిడ్డను బయటకు తీశారా.. లేకా పూర్తి నెలలు నిండిన తర్వాత పురుడు పోశారు. అనేది ప్రశ్నార్ధకం. నిజంగా బేబి పరిపూర్ణంగా లేక పోవడానికి కారణం ఏమిటి అనేది కూడా చర్చ జరుగుతోంది. తల్లి అవివాహితై.. రహస్య కాన్పు అయినా పరిపూర్ణంగా అవయవాలు లేక పోవడంతో పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. 

ఆ తల్లిది సీతరామపురం.. 
అందిన సమాచారం మేరకు ఆ శిశువుకు జన్మనిచ్చిన తల్లి హెచ్‌ఎం పాడు మండలం సీతారామపురం గ్రామానికి చెందిన అవివాహితగా తెలుస్తోంది.   దీనిపై ఐసీడీఎస్‌ సీడీపీఓ లక్ష్మీ ప్రసన్నను సాక్షి వివరణ కోరగా విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. చిన్న పిల్లల ఆస్పత్రిలో పాపను తాము చూశామన్నారు. అశిశువుకు పురుడు పోసిన ఆస్పత్రికి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకుంటామన్నారు.  నిబంధనల ప్రకారం ఆ శిశువును స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు. 

ఐసీడీఎస్‌ అధికారుల ఆధీనంలోకి  శిశువు 
ఆస్పత్రిలో వదిలి వేసిన నవజాత శిశువు(ఆడ)ను ఐసీడీఎస్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీడీపీఓ సీడీపీఓ లక్ష్మీప్రసన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం చిన్న పిల్లల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనాథ శిశువుకు అయ్యే వైద్య ఖర్చును వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మైనార్టీసెల్‌ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే అబ్దుల్‌ గఫార్‌ భరాయిస్తానని తెలిపినట్లు సీడీపీఓ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ప్రస్తుతం పాప పరిస్థితి బాగా లేదని.. వెంటిలేషన్‌పై ఉందన్నారు. కనిగిరి ఆస్పత్రిలోనే ప్రాథమిక చికిత్సలు చేయించి.. వైద్యుల పర్యవేక్షణలో పెద్పాస్పత్రులకు తీసుకెళ్తామని సీడీపీఓ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement