విజయవాడ : పేగుతెంచుకుని పుట్టిన బిడ్డను ఇబ్బందుల కారణంగా ఓ అమ్మ విజయవాడలో వదిలేసింది. చిన్నారిని విడిచి ఉండలేక కొద్ది రోజుల్లోనే వదిలేసిన చోటనే వెదుక్కుంది. ఆ ప్రయత్నం ఫలించడంతో కుమార్తె మళ్లీ తల్లి ఒడికి చేరింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ సంఘటన వివరాలు.. గుంటూరు జిల్లా కొలనుకొండ సమీపంలోని వడ్డేశ్వరం గ్రామానికి చెందిన హుస్సేన్‌బీకి ఇద్దరు కుమార్తెలు. మూడు నెలల చిన్న కుమార్తెకు పుట్టుకతోనే గుండెకు చిల్లు ఉండడంతో అనారోగ్యంతో బాధపడుతుండేది. హుస్సేన్‌బీ భర్త బిందెలకు మాట్లు వేస్తూ వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించేవాడు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుమార్తెకు చికిత్స చేయించలేని పరిస్థితి.
ఈ నేపథ్యంలో హుస్సేన్‌బీ కొద్ది రోజుల కిందట చిన్న కుమార్తెను విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలో ఓ ఆస్పత్రి దగ్గర చెత్తకుండీ వద్ద వదిలివె ళ్లింది. కృష్ణలంక రాణీగారితోటకు చెందిన కుంభా కుసుమకుమారి అటుగా వెళ్తుండగా చిన్నారి ఏడుపు వినిపించింది. ఆమె పాపను తీసుకుని సమీపంలోని దుకాణదారులకు ఈ విషయం చెప్పి తన అడ్రస్ ఇచ్చింది. చిన్నారి కుటుంబసభ్యులు ఎవరైనా వస్తే తన వద్దకు పంపాలని సూచించి బాలికను తీసుకుని వెళ్లిపోయింది.
అనంతరం అనారోగ్యంతో బాధపడుతోందని గుర్తించి వైద్యులకు చూపించింది. కుమార్తెను వదిలి వెళ్లాక హుస్సేన్‌బీ మనశ్శాంతిగా ఉండలేకపోయింది. తన తల్లి నబీషాకు ఈ విషయం చెప్పింది. ఐదు రోజులు గడిచిన తరువాత హుస్సేన్‌బీ తల్లితో కలిసి నగరానికి వచ్చి కూతురిని వదిలేసిన చోట ఆరా తీసింది. స్థానిక దుకాణదారులు కుసుమకుమారి చిరునామా చెప్పడంతో ఆమె ఇంటికి వెళ్లారు. కుమార్తెను వదిలేయడానికి కారణం చెప్పి తనకు తిరిగి ఇవ్వవలసిందిగా కోరింది. దీంతో వారంతా బుధవారం రాత్రి కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఐకి అంతా వివరించారు. కుసుమకుమారి అంగీకారంతో ఆయన చిన్నారిని తల్లికి అప్పగించారు.
తల్లి ప్రేమ గెలిచింది
Published Thu, Jan 29 2015 10:48 PM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM
Advertisement
Advertisement