
భీమడోలుకు చెందిన రామకుర్తి నాగేశ్వరరావు కుటుంబం
పశ్చిమగోదావరి, భీమడోలు: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆతల్లి ఆకాంక్షించింది. అయితే విధి వక్రించి ఎన్నికల రోజే మృతి చెందింది. దాంతో ఆకుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. తమ మాతృమూర్తి కోరిక నెరవేర్చేందుకు అంత బాధలోనూ ఆకుమార్తెలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. భీమడోలు పంచాయతీ శివారు సూర్యారావుపేటకు చెందిన భీమడోలు మండల వైసీపీ ప్రధాన కార్యదర్శి రామకుర్తి నాగేశ్వరరావు, లక్ష్మీదుర్గ నాగ అమరావతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు సింధూర, సాయిరమ్య. రామకుర్తి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు దివంగత సీఎం వైఎస్సార్ కుటుంబం అంటే ఎంతో అభిమానం. ఇదిలా ఉంటే టీడీపీ ఎన్నికల వేళ చేసిన కుట్రల్లో భాగంగా నాగేశ్వరరావు ఓటును తొలగించారు. ఇటీవల రామకుర్తి నాగేశ్వరరావు భార్య అమరావతి తీవ్ర అనారోగ్యం పాలైంది. వైద్యుల సూచనల మేరకు వైద్యం కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గత నెల 9న విజయవాడకు తీసుకుని వెళ్లారు. 10వ తేదీ రాత్రి వైద్యులు పరిస్థితి విషమించడంతో ఇంటికి తీసుకుని వెళ్లాలని సూచించారు.
సరిగ్గా ఎన్నికల రోజు అమరావతి కన్నుమూశారు. దాంతో ఆకుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. అయినా మనోనిబ్బరంతో తల్లి కోరిక నెరవేర్చాలన్న సంకల్పంతో అంత బాధలోనూ ఈనెల 11న భీమడోలులో కుమార్తెలు సింధూర, సాయిరమ్య వైసీపీకి ఓటు వేశారు. ఈనెల 23న వైఎస్ జగన్‌కు అనుకూలంగా వచ్చిన ఫలితాలతో ఆ ఇద్దరు కుమార్తెలు ఎంతో సంబరపడ్డారు. తమ తల్లి కోరిక నెరవేరిందని, ఆమె ఉంటే ఎంతో ఆనందించేదని గుర్తు చేసుకున్నారు. తాను బీటెక్ చదువుకునేందుకు వైఎస్ అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఎంతో దోహదపడిందని పెద్ద కుమార్తె సింధూర తెలిపింది. సీఎంగా జగనన్న తమ లాంటి ఎన్నో పేద కుటుంబాల చదువుకు భరోసా ఇచ్చే ఈ పథకాన్ని మరింత బలోపితం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. చిన్న కుమార్తె సాయి రమ్య మాట్లాడుతూ తాను ఎంబీఏ చదువుతున్నట్టు తెలిపింది. రామకుర్తి నాగేశ్వరరావు సాక్షితో మాట్లాడుతూ వైఎస్ జగనన్న సీఎం అవుతున్నాడన్న వార్త తెలిస్తే తన భార్య ఎంతో సంతోషపడేదని చెప్పారు. ఆమె అనారోగ్యంతో కన్నుమూయడం తమ కుటుంబాన్ని ఎంతో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment