
సీల్డ్ కవర్ సీఎంవి.. నీకేం తెలుసు?
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ భిక్షతో సీల్డ్ కవర్ సీఎంగా దిగివచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఏమి తెలుసునని రాష్ట్ర విభజనతో సమస్యలు ఉత్పన్నమవుతాయంటూ మాట్లాడుతున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిప్పులు చెరిగారు.
నల్లగొండ, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ భిక్షతో సీల్డ్ కవర్ సీఎంగా దిగివచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఏమి తెలుసునని రాష్ట్ర విభజనతో సమస్యలు ఉత్పన్నమవుతాయంటూ మాట్లాడుతున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిప్పులు చెరిగారు. శుక్రవారం వారు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి నల్లగొండలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన అధిష్టానమే ఎలాంటి అర్హతలు లేకున్నా సీఎం కుర్చీలో కూర్చోబెట్టిందన్న విషయాన్ని కిరణ్ గుర్తుంచుకోవాలన్నారు.
అభూత కల్పనలు, అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే సీఎంది సమన్యాయం, సమతూకమంటూ మాట్లాడే స్థాయి కాదని ఎద్దేవా చేశారు. సొంత చిత్తూరు జిల్లాకే తాగునీరంటూ రూ.700కోట్లు కేటాయించిన ఆయన సమన్యాయమంటూ ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటించిన 9రోజుల తర్వాత తెరపైకి వచ్చి ఉభయ ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచే రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడిన ఆయనకు ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హతలేదన్నారు. ఇంతకాలం తెరవెనుక సీమాంధ్ర ఉద్యమాన్ని పురిగొల్పిన ఆయన తక్షణమే రాజీనామాచేసి ప్రత్యక్ష సీమాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని హితవు పలికారు. తెలంగాణ నిర్ణయానికి వైఎస్ రాజశేఖరరెడ్డి కారణమంటూ మనసులో ఇంతకాలం పెట్టుకున్న అసూయను ఆయనపై రుద్దారంటూ మండిపడ్డారు. 2001లో వైఎస్‌తోనే తెలంగాణవాదం ముందుకొచ్చిందంటే, తెలంగాణవాదం 1969, 1972సంవత్సరాల్లో లేదా అన్ని ప్రశ్నించారు.
రెండేళ్ల నుంచి ఏఎమ్మార్పీ ద్వారా తాగునీటికి తప్ప ఒక్క ఎకరానికన్నా అదనపు నీరు ఇచ్చారా, అసలు ఒక్క టీఎంసీకి ఎన్ని ఎకరాలు సాగునీరు పారుతుందో తెలుసా అని ప్రశ్నించారు. రెండున్నరేళ్లు సీఎంగా, ఇరవై ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న కిరణ్‌కు బచావత్ ట్రిబ్యునల్ తెలుసా అని ఎద్దేవా చేశారు. కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ నిర్ణయాన్ని వ్యతిరేకించడం లేదు, స్వాగతించడం లేదని చేసిన వ్యాఖ్యలు దేనికి నిదర్శనమన్నారు. సొంత జిల్లా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మూడో స్థానానికి పరిమితంచేసి ఆయన్ను చిత్తూరు ప్రజలే సీఎంగా పరిగణించడం లేదని ఎద్దేవా చేశారు. వ్యాఖ్యలకు కట్టుబడి వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని, లేదంటే అధిష్టానం వెంటనే బర్తరఫ్ చేసి సమన్యాయం పాటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విషయంలో ఇప్పటికిప్పుడు ఏవేవో సలహాలు, సూచనలు చేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి, అలాంటి వారు వెయ్యి మంది వచ్చినా రాష్ట్ర ఏర్పాటు అడ్డుకోలేరని స్పష్టం చేశారు.