= ఏకాకిగా మారుతున్న వైనం
= విజయవాడలో పురందేశ్వరి చిచ్చు
సాక్షి, విజయవాడ : విజయవాడ ఎంపీ రాజగోపాల్ ఏకాకిగా మారుతున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తే అది నిజమనే అనిపిస్తోంది. సమైక్యవాదానికి నాయకుడిగా చెప్పుకునే రాజగోపాల్ నియోజకవర్గంలోకి వచ్చి కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విభజన జరిగితే సీమాంధ్రకు ఏం సాధించుకోవాలనే అంశంపై నగరానికి చెందిన ప్రముఖులతో సమావేశం అయినా ఎవరూ స్పందించలేదు. పురందేశ్వరి తీరుపై సమైక్యవాదులు విరుచుకుపడ్డారు. జిల్లాలో ఒకటిరెండుచోట్ల పురందేశ్వరి దిష్టిబొమ్మలు దహనం చేశారు.
తెలుగుదేశం నేతలుకూడా పురందేశ్వరి విభజన తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నం చేస్తోందని విరుచుకుపడ్డారు. అయితే ఎంపీ వర్గం నుంచి ఒక్కరు కూడా స్పందించిన పాపాన పోలేదు. గురువారం నగరంలో చోటుచేసుకున్న పరిణామాలను ఎంపీకి వివరించేందుకు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అడపా నాగేంద్రం, ఎంపీ వర్గంలోని మరికొందరితో కలిసి ఢిల్లీకి వెళ్లారు.
పురందేశ్వరి సమావేశం, రాజగోపాల్‌పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు చేసిన ఆరోపణలపై స్పందించి సమావేశం పెట్టాలని ఎంపీ కార్యాలయం నుంచి స్థానిక ఎమ్మెల్యేలకు ఫోన్లు వెళ్లాయి. అయితే ఈ వివాదంలోకి తమను లాగవద్దంటూ వారు సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. సమైక్యంధ్ర కోసం 78 రోజులుగా ఉద్యమం జరుగుతుంటే తన ల్యాంకో సంస్థ నుంచి నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేయడం, విద్యుత్ సమ్మె రోజుల్లోనే ల్యాంకో ద్వారా వంద కోట్ల రూపాయల లాభాలు గడించినట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ వర్గాలు కూడా రాజగోపాల్‌పై గుర్రుగా ఉన్నాయి.
2009లో సమైక్యవాదిగా హడావిడి చేసినా 2013కి వచ్చే సరికి రాజీనామాని ఆమోదింపజేసుకోకుండా అడుతున్న డ్రామాలతో రాజగోపాల్ విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఓటర్ల దృష్టిలో కూడా పలుచనయ్యారు. ఈ నెల 21న విజయవాడలో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి 24 కల్లా రాజీనామా ఆమోదింపజేసుకుని వచ్చి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని ప్రగల్భాలు పలికిన రాజగోపాల్ నెల రోజులు దగ్గర పడుతున్నా అడ్రస్ లేరు. ఢిల్లీలో స్పీకర్ కార్యాలయం ముందు హడావిడి చేయడానికే పరిమితమయ్యారు.
తన రాజీనామా ఆమోదించాలంటూ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నారని వస్తున్న వార్తల పట్ల కూడా సమైక్యవాదులు రాజగోపాల్‌పై మండిపడుతున్నారు. విభజనకు కారకులంటూ బొత్స సత్యనారాయణ, చిరంజీవిపై పరోక్షంగా రాజగోపాల్ ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్‌లోని కాపు సామాజిక వర్గం కూడా రాజగోపాల్‌కు దూరం అయ్యింది.