
మార్చి 18 న ఎమ్మార్పీఎస్ చలో అసెంబ్లీ
ఎస్సీ వర్గీకరణకూ మార్చి 18న ఎమ్మార్పీఎస్ తలపెట్టిన చలో అసెంబ్లీ పిలుపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వరకే పరిమితం చేసినట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు.
హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణకూ మార్చి 18న ఎమ్మార్పీఎస్ తలపెట్టిన చలో అసెంబ్లీ పిలుపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వరకే పరిమితం చేసినట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. గురువారం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణకోసం ఈ నెల 18వ తేదీన ఏపీ,తెలంగాణ అసెంబ్లీలను ముట్టడి చేయాలని నిర్ణయించామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎమ్మార్పీఎస్ బృందం కలిసిందని ఆయన నిర్ణయం ప్రకటించే వరకు వేచి చూడాలని నిర్ణయించామన్నారు. అయితే ఎస్సీ వర్గీకరణ చేసి పెద్దమాదిగనవుతానన్న చంద్రబాబు మాదిగలను మోసం చేస్తున్నాడని, ఆయనపై పోరాటం చేస్తామన్నారు. ఎస్సీల్లో ఉన్న 59 కులాలలో బైండ్ల కులం కూడా ఒకటని, మోత్కుపల్లి అరోపించినట్లుగా కడియం శ్రీహరి ఎస్సీ కాదనడం సరైంది కాదని చట్టబద్దంగా నిరూపించాలని ఒకవేళ నిరూపించలేకపోతే ఇలాంటి వాక్యాలు ఇక ముందు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎంతో మంది మంత్రులపై వచ్చిన అరోపణలను పట్టించుకోని కేసీఆర్ రాజయ్యను బర్తరఫ్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రస్తుతం కేసీఆర్ మంత్రి వర్గంలో 18 మంది మంత్రులు ఉండగా కేవలం ఎస్సీకి సంబందించిన మంత్రి ఒక్కరే ఉన్నారని, మరో ముగ్గురుకి అవకాశం కల్పించాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
(బౌద్దనగర్)