
మృతులకూ పింఛన్లు
కణేకల్లు : కణేకల్లు మేజర్‌గ్రామ పంచాయితీలో పింఛన్ల పంపిణీలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. చచ్చినోళ్ల పింఛన్లను రద్దు చేయకుండా అప్పనంగా ప్రతి నెలా మెక్కేశారు. రెండేళ్ల నుంచి ఈ స్వాహా వ్యవహారం సాగుతోంది. కణేకల్లు పంచాయితీలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు కలిపి మొత్తం 1569 మంది (సెప్టెంబర్ వరకు)కి పింఛన్లు మంజూరవుతున్నాయి.
వృద్ధులు, వికలాంగులకు రూ.200, వికలాంగులకు రూ.500 ప్రకారం పింఛన్లు మంజూరయ్యేవి. 2012 నుంచి ఇప్పటి వరకు 52 మంది పింఛన్‌దారులు మృతి చెందారు. అయితే వీరి పేరిట పింఛన్లు మంజూరు అవుతూనే ఉన్నాయి.
వెలుగు చూసిందిలా...
సెప్టెంబర్ వరకు వీరు పింఛన్లు తీసుకొన్నట్లు అక్విటెన్స్‌ల్లో వేలిముద్రలు కూడా ఉన్నాయి. పింఛన్ల సర్వే సందర్భంగా పింఛన్ల అక్రమాల బాగోతం బయటపడింది. ఈ విషయం అధికారులకు తెలిసినా ఏలాంటి చర్యలు తీసుకోలేదు. ముడుపులకు ఆశపడే అధికారులు విషయాన్ని మరుగునపరచినట్లు ఆరోపణలు ఉన్నాయి.
పంపిణీదారు నుంచి మామూళ్లు తీసుకొన్న అధికారులు స్వాహా సొమ్ము రికవరీ చేయకుండా మౌనంగా ఉంటున్నట్లు తెల్సింది. ఇది ఇలా ఉండగా చనిపోయినోళ్ల పేరిట పింఛన్లు తీసుకొన్నరన్నా విషయం తెల్సుకొన్న వారి బంధువులు నిర్వహకుల తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి స్వాహా చేసిన పింఛన్ల సొమ్మును రికవరీ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
స్వాహాకు తెరలేిసిందిలా...
పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం స్మార్ట్ కార్డు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ విధానం వందశాతం పూర్తి కాలేదు. అనేక మందికి స్మార్ట్ కార్డులు లేవు. దీనిని ఆసరగా చేసుకొన్న పంపిణీదారులు చనిపోయిన వారి పేరిట పింఛన్ల స్వాహాకు తెరలేపారు. ఒక నెల వృద్ధులు పింఛన్ల కోసం రాకపోతే వారి గురించి ఆరా తీసి మరుసటి నెల నుంచి వారి పింఛన్లను తమ జేబులో వేసుకొం టున్నారు. వారు పింఛన్లు తీసుకొన్నట్లు అక్విటెన్స్‌లో వేలిముద్రలు కూడా వేయించుకోవడం గమనార్హం.
చనిపోయిన పింఛనుదారుల వివరాలు..
రహింబీ.. (వరస సంఖ్య 650697) ఈమె ఒకటిన్నర సంవత్సరం కిందట మృతి చెందారు. షరిఫా (వరస సంఖ్య 435406) ఈమె చినిపోయి ఏడాదైంది. ఖాసీంబీ (వరస సంఖ్య 435407) చనిపోయి ఎనిమిది నెలలైంది. ఖాసీంబేగ్ (వరస సంఖ్య 611392) చనిపోయి ఏడాదైంది.
కలేకుర్తి అబ్బాస్ (వరస సంఖ్య 626499) ఏడాది కిందట చనిపోయారు. ఇస్మాయిల్ (వరస సంఖ్య 129643) చనిపోయి ఏడాదిన్నరైంది. ఏం.మాబుసాబ్ (వరస సంఖ్య 434949) చనిపోయి ఒకటిన్నర ఏడాదైంది. వన్నూర్‌బీ (వరస సంఖ్య 129706) చనిపోయి ఏడాదైంది. ఇలా సుమారు మరో 44 మంది పేర్లతో పంపిణీదారులు పింఛన్లు స్వాహా చేశారు.