కార్పొరేషన్, న్యూస్‌లైన్ : మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల చైర్మన్ల, వార్డు స్థానాల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం రాత్రి ఉత్తర్వులను వెలువరించింది. నిజామాబాద్ నగర పాలక సంస్థ, కామారెడ్డి, ఆర్మూర్ మున్సిపాలిటీల చైర్మన్ స్థానాలు జనరల్ మహిళలకు రిజర్వ్ అయ్యాయి. బోధన్ చైర్మన్ స్థానం మాత్రం జనరల్ అయ్యింది.
గతేడాది సెప్టెంబర్‌లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. అయితే మున్సిపల్ కార్పొరేషన్ల డివిజన్ల రిజర్వేషన్లు, మేయర్ల, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ప్రకటించే సమయంలో రాష్ట్ర విభజన అంశం ఊపందుకోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. బల్దియలకు మూడేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు. కోర్టులు జోక్యం చేసుకొని బల్దియాలకు ఎన్నికలు నిర్వహించాలని జనవరిలో ఆదేశించడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. రిజర్వేషన్లను ఖరారు చేయడంతో ఆశావహుల్లో ఆనందం ఉరకలెత్తుతోంది. తమ వార్డుల్లో, డివిజన్లలో పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్న నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకోగా.. రిజర్వేషన్ల ఖరారుతో ఇక కార్యరంగంలోకి దూకడానికి సన్నద్ధమవుతున్నారు. కాగా రిజర్వేషన్లు పలువురు ఆశావహుల ఆశలపై నీళ్లు గుమ్మరించాయి. తమ స్థానాలు రిజర్వ్ కావడంతో జనరల్ అభ్యర్థులు డీలా పడిపోయారు.
‘మున్సిపల్’ రిజర్వేషన్ల ఖరారు
Published Sun, Mar 2 2014 4:09 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement